Saturday, May 4, 2024

Bilkis Bano: సుప్రీంకు చేరిన బిల్కిస్​ బానో కేసు.. విచారణకు స్వీకరించిన ధర్మాసనం!​

2002లో జరిగిన బిల్కిస్ బానో కేసులో (అత్యాచారం, హత్య) దోషులుగా తేలిన 11 మందికి మంజూరు చేసిన రిమిషన్​ (ఉపశమనం)ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించడానికి సుప్రీంకోర్టు ఇవ్వాల (మంగళవారం) అంగీకరించింది. సీపీఐ(ఎం) నేత సుభాషినీ అలీ, ఇండిపెండెంట్​ జర్నలిస్ట్​, సినీ నిర్మాత రేవతి లాల్, మాజీ ఫిలాసఫీ ప్రొఫెసర్, కార్యకర్త రూప్ రేఖ్ వర్మ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు హిమా కోహ్లీ, సీటీ రవికుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు న్యాయవాది అపర్ణా భట్, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు. రిమిషన్ ఆర్డర్‌ను వారు సవాలు చేస్తున్నారని న్యాయవాది సమర్పించారు. గర్భిణీ స్త్రీపై అత్యాచారం చేసి ప్రజలను చంపారని నొక్కి చెప్పారు.

అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం వారికి ఉపశమనం లభిస్తుందా? అని ధర్మాసనం కౌన్సిల్‌ను ప్రశ్నించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు రాష్ట్రాన్ని ఆదేశించిందని, వారు రిమిషన్‌ను సవాలు చేస్తున్నారని, అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వును కాదని సిబల్ బదులిచ్చారు. అయితే ఈ కేసును తాము పరిశీలిస్తాం’’ అని బెంచ్ చెప్పింది. ఈ విషయాన్ని బుధవారం విచారణకు స్వీకరించాలన్న భట్ అభ్యర్థనపై “కాగితాలు చూద్దాం” అని బెంచ్ బదులిచ్చింది.

మహువా మొయిత్రా సుప్రీంకోర్టుని సవాలు చేశారు..

కాగా, సామూహిక అత్యాచారం, సామూహిక హత్య కేసులో 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బిల్కిస్ బానో, ఆమె కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ మొయిత్రా న్యాయవాది షాదన్ ఫరాసత్ ద్వారా పిఐఎల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేశారు. బిల్కిస్ బానో విషాదం ఇరవై ఏళ్ల క్రితం జరిగింది. అంటే.. 2002, ఫిబ్రవరి 28న  గోద్రా స్టేషన్‌లో సబర్మతి ఎక్స్ ప్రెస్‌కు కరసేవకులు నిప్పు పెట్టారు. రైలు దాడి తరువాత జరిగిన అల్లర్లలో వేలాది మంది అమాయక ప్రజలు, ఎక్కువగా ముస్లిం కుటుంబాలను టార్గెట్​ చేసుకుని దాడి చేసి చంపేశారు.

ఆ సమయంలో 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు, ఐదు నెలల గర్భవతి అయిన బిల్కిస్ బానో తన మూడేళ్ల కుమార్తె – సహేలాతో సహా తన కుటుంబంతో రాష్ట్రం నుండి పారిపోవడానికి ప్రయత్నించింది. 2002 మార్చి 3న కుటుంబం పన్నివేల్ గ్రామానికి చేరుకుని పొలంలో ఆశ్రయం పొందింది. అయినప్పటికీ.. కర్రలు, కొడవళ్లు, కత్తులతో ఆయుధాలు కలిగి ఉన్న దాదాపు 20-30 మంది హిందూ పురుషులు వారిని అడ్డుకున్నారు.

- Advertisement -

‘ఆ రహ్య ముసల్మానో, ఎమనే మారో, కాతో’ (వీరే ముస్లిములు, చంపండి, నరికివేయండి’) అని వారు అరుస్తుండగా బిల్కిస్ చాలామందిని గుర్తించారు.

బిల్కిస్ కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురయ్యారు. కాపాడండి అంటూ కేకలు పెట్టినా ఎవరూ వినిపించుకోలేదు. బిల్కిస్, ఆమె తల్లితో సహా నలుగురు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుల్లో ఒకరైన – శైలేష్ భట్ – బిల్కిస్ కుమార్తెను ఆమె చేతుల నుండి లాక్కొని.. పసిపిల్ల తలను నేలకేసి కొట్టి చంపేశాడు.

ఆ రోజు ఆమె కుటుంబ సభ్యులు 15 మంది చనిపోయారు. అంతకుముందు రోజే ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె బంధువును ఆమె పసిపాపతో సహా అతి కిరాతకంగా అత్యాచారం చేసి, హతమార్చారు. బిల్కిస్‌ను నగ్నంగా అపస్మారక స్థితిలో వదిలేశారు. బిల్కిస్ ఒంటరిగా ప్రాణాలతో బయటపడింది. ఆ హత్యలకు ప్రత్యక్ష సాక్షి అయినందున ఆమె తన పసిబిడ్డతో సహా మృతదేహాలను గుర్తించే పరీక్షలో పడింది. అత్యాచారం జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.

ఆరేళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత 2008, జనవరి 18న ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం 11 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. (అందులో ఒకరు చనిపోయారు) సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించినందుకు ఒక పోలీసును మూడేళ్లపాటు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement