Monday, April 29, 2024

Big story: శీలావతి.. ఏవోబీ-విశాఖ మన్యంలో వారికి అదే ప‌ని..

అమరావతి, ఆంధ్రప్రభ: శీలావతి… పేరు బాగుంది కదూ… ఇదేదో పవిత్రమూర్తి… పరమసాధ్వి పేరో అనుకోకండి.. మరోలోకంలోకి తీసుకువెళ్లేలా మత్తెక్కించే ఘాటైన గంజాయి రకం పేరు. ఒకసారి అలవాటైతే తనకోసం పరితపించేలా చేసి, రప్పించే గంజాయి ఇది. అంతర్జాతీయ మార్కెట్‌లో సిరులు కురిపిస్తూండటంతో ఎంతకైనా తెగించి అక్రమంగా పండించేందుకు స్మగ్లర్లు తహతహలాడుతున్నారు. సాగుకు అనుకూలిస్తున్న వాతావరణం, అక్రమ రవాణాకు సులువుగా ఉండే మార్గాలు ఉండటంతో విశాఖ మన్యం, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఈ రకం పంట ఎక్కువగా పండిస్తున్నారు. అది తప్పని తెలియక కొందరు, డబ్బుపై ఆశతో కొందరు, జీవనాధారం లేక మరికొందరు ఈ గంజాయి అక్రమ సాగుకు సహకరిస్తున్నారు.

తెరవెనుక ఉండి కథ నడుపుతున్న అసలు స్మగ్లర్లు ఎప్పుడూ బయటపడరు. గంజాయి తరలింపు కూడా రైళ్లు, బస్సులు, వాహనాల్లో జరిగిపోతూంటుంది. పట్టుబడితే జైలుపాలయ్యేది మధ్యవర్తులే. ఈ గంజాయి ఎంత లాభసాటిగా ఉందంటే.. పట్టుబడిన వాహనాలను స్మగ్లర్లు ఎన్నడూ వెనక్కు తీసుకోవడం లేదు. ఎందుకంటే, వాటి విలువకన్నా వారికి అక్రమ రవాణాతో వచ్చే రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ‘గంజాయి’ సమస్యపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) దృష్టి సారించింది. గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు తనిఖీలు.. దాడులు చేస్తూ గంజాయికి అడ్డుకట్ట వేసేలా ఆపరేషన్‌ పరివర్తన అమలు చేస్తోంది.

ఆ కార్యక్రమం ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రంలోని విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీ మండలాల్లో ఏళ్ల తరబడి గంజాయి సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోకి వివిధ మార్గాల్లో రవాణా అవుతోంది. ఇటీవల గంజాయి సాగు.. రవాణాపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ నేపథ్యంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు అప్రమత్తమయ్యారు. వారం రోజులుగా విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆపరేషన్‌ పరివర్తన పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖ జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో గంజాయి సాగు చేస్తున్న 13 గ్రామాల్లో విస్తృత దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ), పోలీసు శాఖల నుంచి 66 ప్రత్యేక టీములు పాల్గొని రూ.104.25 కోట్ల విలువైన 550 ఎకరాల్లోని 21లక్షల గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని మరో 45 ఎకరాల్లో గంజాయి మొక్కలను అధికారులు ధ్వంసం చేశారు.

అమాయక గిరిజనులకు డబ్బు ఆశ చూపించి స్మగ్లర్లు గంజాయి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ముందు స్మగ్లర్లకు సహ కరించే గిరిజనుల్లో అవగాహన, కౌన్సిలింగ్‌కు ఆపరేషన్‌ పరివర్తనలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. పాడేరు, జి.మాడుగుల, నర్సీపట్నం, చింతపల్లి, జీకే వీధి మండలాలతో పాటు తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ గ్రామాలైన కొత్తూరు, నులకమద్ది, కచ్చూరు, గుర్తేడు, సోకులగూడెం ప్రాంతాల్లో విస్తృత సదస్సులు నిర్వహించారు. గిరిజనులు, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి గంజాయి సాగు, దుష్ఫరిణామాలపై నిపుణులు, పోలీసు అధికారులతో వివరించారు. గంజాయి వలన ఏ విధంగా నష్టాలు ఉంటాయనే దానితో పాటు సాగు, రవాణాలో పాల్గొంటే చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. గిరిజనులు ఇకపై ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడబోమంటూ చెప్పడమే కాక అప్పటికే సాగు చేసిన 130 ఎకరాల్లోని గంజాయిని ధ్వంసం చేయడం విశేషం.

- Advertisement -

గంజాయి రవాణాకు స్మగ్లర్లు ఎంచుకుంటున్న మార్గాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. రాష్ట్రం నుంచి గంజాయి తరలి వెళ్లే అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించడంతో పాటు నిఘాను పటిష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణాకు అనువుగా లేకున్నా కాలిబాట సాయంతో సరిహద్దులు దాటు తున్న కొన్ని ప్రాంతాలను ఇతర శాఖల సహకారంతో ఎస్‌ఈబీ అధికారులు మూసేయించారు. ఆయా ప్రాంతాల్లో నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు. గంజాయి కట్టడికి పోలీసు ఉన్నతాధికారుల ద్వారా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పొరుగు రాష్ట్రాల సహకారం తీసుకుంటోంది.

కొద్ది రోజుల కిందట విశాఖ పట్టణం, రాజమండ్రి ప్రాంతాల్లో డీజీపీ గౌతం సవాంగ్‌ ఒడిశా, చత్తీస్‌గడ్‌, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గంజాయి రవాణా చోటు చేసుకుంటున్న విధానం వివరించడంతో పాటు ఆయా రాష్ట్రాల మీదుగా ఎలా వెళుతోందనే దానిపై సంబంధిత అధికారులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించి సహకారం కోరారు. రానున్న రోజుల్లో కూడా ‘ఆపరేషన్‌ పరివర్తన’ కార్యక్రమం కొనసాగుతుందని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెం ట్‌ బ్యూరో అధికారులు చెపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement