Tuesday, April 30, 2024

సమస్యల వలయంలో బీబీనగర్ ఎయిమ్స్ …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డాక్టర్‌ కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో సీటు సాధించాలని కలలు కంటారు. ఎయిమ్స్‌లో సీటు సాధిస్తే వైద్య విద్యార్థికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లే. అలాంటిది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ వివక్ష కారణంగా వైద్య విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కనీస వసతులు కూడా లేకపోవడంతో ఇక్కడ సూపర్‌ స్పెషాలిటీ సేవలు కాదు కదా రోగులకు పీహెచ్‌సీ స్థాయి వైద్య చికిత్సలు కూడా అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నామమాత్రంగా ఓపీ నడుస్తుండటంతో 3 ఏళ్ల నుంచి ఇన్‌ పేషెంట్లుగా అడ్మిట్‌ చేసుకోలేని పరిస్థితి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యార్థులకు క్లినికల్‌ ప్రాక్టీస్‌ను సమీపంలోని భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసింది. దేశ రాజధాని ఢిల్లిలో ఉన్న విధంగా ప్రతి రాష్ట్రంలోనూ ఎయిమ్స్‌ నిర్మించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఐదేళ్ల క్రితం 201 ఎకరాల భూమిని 200 పడకలతో కూడిన ఆస్పత్రి భవనాన్ని ఎయిమ్స్‌కు అప్పగించింది. అప్పటి నుంచి నిర్మాణంలో ఉన్న భవనాల పనులు సైతం ఎక్కడివక్కడే నిలచిపోయాయి.

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో భవనాలు, విద్యార్థులు, సిబ్బంది మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1028 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, అందులో ఇప్పటి వరకు కేవలం రూ.28 కోట్లు మాత్రమే విడుదల చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఇక్కడ కనీసం బెడ్స్‌ కూడా లేకపోవడంతో ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థలో సీటు పొందిన వైద్య విద్యార్థులు ఇక్కడ సీటు వద్దని గాంధీ మెడికల్‌ కాలేజీలో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫ్యాకల్టిdకి సంబంధించి మొత్తం 183 పోస్టులు ఉండగా, వాటిలో కేవలం 92 మందినే నియమించారు. మిగతా 91 ఖాళీగానే ఉన్నాయంటే బీబీనగర్‌ ఎయిమ్స్‌ పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో పూర్తి స్థాయిలో ఫ్యాకల్టి లేని కారణంగా తరగతులు సరిగా జరగడం లేదని కేంద్ర ప్రభుత్వానికి ఎయిమ్స్‌ విద్యార్థులు ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళ్లింది.

ఇదిలా ఉండగా, బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 2021లో శస్త్ర చికిత్సల విభాగం ప్రారంభమైంది. అప్పటి నుంచి కేవలం 294 శస్త్ర చికిత్సలు మాత్రమే జరిగినట్లు సమాచారం. సీనియర్‌ రెసిడెంట్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో శస్త్ర చికిత్సలతో పాటు వైద్య సేవలు కూడా అంతంత మాత్రంగానే అందు తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీబీనగర్‌ ఎయిమ్స్‌ దుస్థితిని గమనించి పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించి వైద్య విద్యార్థులు, రోగులకు సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement