Monday, April 29, 2024

కరోనా కొత్త లక్షణం… ‘హ్యాపీ హైపోక్సియా’!

దేశంలో కరోనా వైరస్ రెండో వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతుంటే.. మరణాలు వేలల్లో సంభవిస్తున్నాయి. యువకుల మీద కూడా కరోనా ప్రభావం పెరిగింది. ఇప్పటి వరకు కరోనా లక్షణాలు కనిపించేవి. కానీ ప్రస్తుతం మహమ్మారి కొత్త కొత్త రూపాల్లో ప్రజలపై పంజా విసురుతోంది. అసలు ఎటువంటి లక్షణాలూ కనిపించకుండా కూడా కరోనా సోకి అకస్మాత్తుగా మరణిస్తున్న కేసులూ నమోదు అవుతున్నాయి. లక్షణాలు కనిపించకుండా చాపకింద నీరులా కరోనా చుట్టబెట్టే కారణం ‘హ్యాపీ హైపోక్సియా’! పేరులో హ్యాపీ ఉంది కానీ ఇది ప్రజల జీవితాల్ని విషాదంలో ముంచేస్తోంది. ఈ వ్యాధిలో ముఖ్యలక్షణం ఏమిటంటే.. ఒక వ్యక్తికి ఈ వ్యాధి కనుక సోకితే.. ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ, ఆక్సిజన్ స్థాయి 50 శాతానికి పడిపోతుంది.

జలుబు, జ్వరం, దగ్గుతో మొదలై కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రమైన న్యుమోనియా మరియు శ్వాస సమస్యలకు దారితీస్తుంది. కరోనాతో వచ్చే అతిసారం, రుచి లేకపోవడం, రక్తంలో గడ్డకట్టడం వంటి కొత్త లక్షణాలను పరిశోధకులు ఇప్పటికే కనుగొన్నారు. ఇప్పుడు ఈ కొత్త లక్షణం, హ్యాపీ హైపోక్సియా, సెకండ్ వేవ్ లో యువతలో ఎక్కువ మందికి సోకింది. ఇది భారతదేశంలో బయటపడటం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది.

హైపోక్సియా అంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువ. ఆరోగ్యకరమైన వ్యక్తి రక్తంలో ఆక్సిజన్ సంతృప్తత 95% లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ, కరోనా రోగులలో ఆక్సిజన్ సంతృప్తత 50% కి తగ్గుతోంది. హైపోక్సియా కారణంగా కిడ్నీ, మెదడు, గుండె ఇతర ప్రధాన అవయవాలు పనిచేయడం మానేయవచ్చు.

సాధారణంగా కరోనా లక్షణాలు కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు కొన్ని కేసుల్లో కరోనా లక్షణాలు కనిపించకపోయినా వారిలో కరోనా వైరస్ లోడ్ ఎక్కువ అయిపోతోంది. దీంతో ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతూ వస్తాయి. ఒక్కసారి 50 శాతం స్థాయికి ఆక్సిజన్ పడిపోతుంది. కరోనా సోకిన కొంత మంది ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం, ఆక్సిజన్‌ అందక చనిపోవడం లాంటి ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ‘హ్యాపీ హైపోక్సియా లేదా సైలెంట్‌ హైపోక్సియా’ అని వైద్యులు చెప్తున్నారు. కరోనా సోకిన వారిలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోతుంది. ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ ఇటీవల యువతలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గుతున్నా ఆయాసం లాంటి లక్షణాలు కనిపించడం లేదు.

టాయిలెట్‌కు వెళ్లినప్పుడు ఆయాసం, పెదవులు నీలం రంగులోకి మారడం, చల్లని వాతావరణంలో కూడా చెమట రావడం వంటివి హ్యాపీ హైపోక్సియా లక్షణాలుగా చెబుతున్నారు. పల్స్‌ ఆక్సీ మీటర్‌లో 92 శాతం కంటే తక్కువ ఆక్సిజన్‌ లెవెల్‌ చూపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని, వైద్యుల సూచనలతో హెచ్‌ఆర్‌సీటీ స్కానింగ్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఇదీ చదవండి: కరోనా రాదని ఆవుపేడ పూసుకుంటున్నారు.. కానీ ఇలా చేస్తే ప్రమాదం అంట

Advertisement

తాజా వార్తలు

Advertisement