Thursday, May 9, 2024

బీసీ కులాలవారీగా జనగణన చేయాలే.. మా మౌనాన్ని ఈజీగా తీసుకోవద్దు: టీఆర్‌ఎస్ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశం మీద ఫోకస్ చేసి పార్లమెంట్ ఉభయసభల్లో చర్చకు పట్టుబడుతున్నామని, చర్చకు అనుమతించకపోతే వాకౌట్ చేస్తున్నామని టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు తెలిపారు. రాజ్యసభ, లోక్‌సభను వాకౌట్ చేసిన అనంతరం ఆ పార్టీ ఎంపీలు తెలంగాణా భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రం తీరుపై వారు మండిపడ్డారు.

సామాజిక న్యాయం కోసమే పోరాటాలు : కేకే
వెనుకబడిన కులాలవారీగా జనగణన చేపట్టాలని రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు డిమాండ్ చేశారు. ఆర్టీఐ ప్రకారం ఉద్యోగుల్లో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తక్కువగా ఉందని, కులాల వారీగా జనగణన జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్దంగా వ్యవహరించని ప్రభుత్వానికి అధికారం లో ఉండే హక్కు లేదని స్పష్టం చేశారు. వేల సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల వారు పోరాడుతున్నారని, తెలంగాణ పోరాటం కూడా సామాజిక న్యాయం కోసమేనని వివరించారు. తమ మౌనం వెనుక ఎంతో పెద్ద కథ ఉంటుందని, తమ మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దని కె.కేశవరావు హెచ్చరించారు. సామాజిక, ఆర్ధిక కుల గణనతో ఉపయోగం లేదని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన మనదేశాన్ని అర్ధం చేసుకోవడం కష్టమంటూ కుల గణన వద్దంటే ఇంతకంటే దిగజారుడుతనం ఏముంటుందని తీవ్రస్థాయిలో నిలదీశారు.

బలహీన వర్గాల వ్యతిరేకి కేంద్ర ప్రభుత్వం : నామా నాగేశ్వరరావు
కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చామని, స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసి బయటకు వచ్చామని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. 92 ఏళ్ల క్రితం 1931లో కులగణన జరిగిందని గుర్తు చేశారు. కులగణన చేపట్టాలని, ఓబీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయాలని, జాతీయ స్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం 2014లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిందని తెలిపారు. ఎనిమిదేళ్ళు గడిచినా కేంద్రం నుంచి స్పందన లేదని నామా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల అంశాలపై నిర్విరామంగా పార్లమెంట్‌ ఉభయసభల్లో లేవనెత్తుతున్నామని చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి ఈ కేంద్ర ప్రభుత్వమని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగాలని అనేక అంశాలను సభల్లో లెవనెత్తుతున్నామని, గతంలో 9 రోజులు నిర్విరామంగా రైతుల కోసం పార్లమెంట్‌లో పోరాడామని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాల కోసమే మిగతా పార్టీల నేతలు మాట్లాడుతున్నారని, కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉన్న ప్రభుత్వాలు కూడా అసెంబ్లీ తీర్మానం చేయాలని నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతులు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల పక్షాన టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీల ఎంపీలూ మాట్లాడట్లేదన్నారు. రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల ఎంపీలు ఒక్కసారైనా పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డారా అని ప్రశ్నించారు.

ఏకరూప వరి సేకరణ విధానం అమలు చేయాలి:రంజిత్ రెడ్డి
ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన పని ఓబీసీలకు ఎందుకు చేయడం లేదని ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు పదే పదే అడుగుతున్నాయని గుర్తు చేశారు. అసలు లెక్క బయటకు వస్తే రిజర్వేషన్లు అమలు చేయలేరు కాబట్టే కులాల గణన చేయడం లేదని ఆరోపించారు. గంటల తరబడి సభలో తాము కింద కూర్చుని ఆందోళన చేస్తే నవ్వడం తప్ప కాంగ్రెస్ ఎంపీలు తమతో కలిసి రారని విమర్శించారు. ఆనాడు తాము స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేస్తుంటే ఇప్పుడు మాట్లాడుతున్న ఎంపీలు అప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తమతో కలిసి రావాలని అనేకసార్లు అడిగినా స్పందించలేదన్నారు. ఏకరూప వరి సేకరణ విధానాన్ని అమలు చేయాలని రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. కనీస మద్ధతు ధరకు అన్ని రాష్ట్రాల్లో వరి ధాన్యాన్ని సేకరించాలన్నదే తమ డిమాండ్ అని, బాయిల్డ్ రైస్ అయినా, మామూలు ధాన్యమైనా కేంద్రమే కొనాలని నొక్కి చెప్పారు. తమ ప్రతిపాదన అయిన జాతీయ స్థాయిలో ధాన్యం సేకరణకు రాహుల్ మద్దతు తెలిపారని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణాలోనూ కూడా మొత్తం ధాన్యం సేకరణ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రతి అంశంపై ఎలా పోరాడాలనేది తమకు తెలుసన్న ఎంపీ రంజిత్‌రెడ్డి ఎవరికీ భయపడేది లేదని ఓపెన్ డిబేట్ చేద్దామంటూ సవాల్ విసిరారు. తమవేమీ గొంతెమ్మ కోర్కెలు కావని, పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్నదే మాకివ్వాలని అడుగుతున్నామన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి సహాయం అందించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అనవసరంగా ట్వీట్ చేసి రకరకాలుగా రాద్ధాంతం చేస్తే మంచిగుండదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత పై మణికం ఠాకూర్ ట్వీట్ చేయడం అవసరమా అని ఆయన అడిగారు. కనీస మద్దతు ధర ఇచ్చేది వడ్లకు మాత్రమేనన్న ఆయన, అందుకే వడ్లు మొత్తం కొనాలని డిమాండ్ చేశారు.

అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి : మన్నె శ్రీనివాసరెడ్డి
ఎన్ని రకాలుగా రైతుల కోసం పోరాడుతున్నా కేంద్రం మాత్రం న్యాయం చేయడం లేదని ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమానంగా చూడాలని సూచించారు. కాంగ్రెస్ ఎంపీలు మర్యాద లేకుండా దిగజారి మాట్లాడుతున్నారని, వ్యక్తిగత దూషణలు మాని ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. వారు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు.

- Advertisement -

అసెంబ్లీ తీర్మానంపై లేని స్పందన : రాములు
బీసీల కులాల గణన జరగాలని తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి పంపినా ఇంతవరకూ స్పందన లేదని ఎంపీ రాములు విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్ర శాసనసభ తీర్మానాన్ని ఏవిధంగా పరిగణిస్తున్నారో చూస్తున్నామన్నారు. రైతులపై మాట్లాడే హక్కు కేవలం సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ నేతలకే ఉందని నొక్కి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement