Saturday, April 27, 2024

కేసీఆర్.. వడ్లపై ఎందుకీ డ్రామాలు.. కశ్మీర్ ఫైల్స్ పై అక్కసు ఎందుకో?

యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో కొత్త డ్రామాలాడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తన పాలన పట్ల ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే కేసీఆర్.. ఇట్లాంటి డ్రామాలాడుతున్నారని అన్నారు. కేసీఆర్ దుకాణం బంద్ అయ్యిందని…  రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి పైసా చెల్లిస్తోంది కేంద్రమేనని… ఇకపైనా కేంద్రం తెలంగాణ రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసేది బ్రోకరిజమేనని చెప్పారు. ”కేసీఆర్… చేతనైతే బ్రోకరిజం చెయ్.. కమీషన్ తీసుకో… చేతగాకుంటే ఇంట్లో పడుకో… అంతే తప్ప రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకో… లేకుంటే రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్ కు వయసు మీద పడి మతి తప్పిందన్నారు. గంటల కొద్దీ ఏదేదో మాట్లాడుతున్నడని విమర్శించారు. తన పాలనపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు రోజుకో కొత్త సమస్యను సృష్టించి దాని ద్వారా జల్సా చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజల ద్రుష్టి మళ్లించేందుకే వడ్ల పేరిట డ్రామాలాడుతున్నారని అన్నారు. రా రైస్ కొంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్పారని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు బియ్యం సేకరణపై స్పందించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంత వరకు స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదని, విధివిధానాల్లేవని పీయూష్ గోయల్ గతంలోనూ పార్లమెంట్ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ఇన్నాళ్లు బాయిల్డ్ రైస్ కొనాలని డ్రామాలాడిన కేసీఆర్.. ఇప్పుడు మాటమార్చి వడ్లు మాత్రమే కొనాలని మళ్లీ కొత్త డ్రామా చేస్తున్నాడని దుయ్యబట్టారు.

గతంలో వరి వేస్తే ఉరే గతి అని రైతులను బెదిరించారని, ఆయన మాత్రం ఫాంహౌజ్ లో వరి పంట వేసి కోటీశ్వరుడు అయ్యారని మండిపడ్డారు. రైతులు ఇబ్బంది పడుతుంటే రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”కేసీఆర్… అసలెందుకీ డ్రామాలు? కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంది కదా… ఎందుకు సహకరించడం లేదు? వడ్లు మాత్రమే కొనాలని ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదు? కేంద్రం అనేకసార్లు మీటింగ్ పెడితే ఎందుకు చెప్పలేదు? నీ మూర్ఖత్వంవల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే జల్సా చేస్తవా? రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలెందుకు… ఇట్లనే  చేస్తే రైతులు తిరగబడే రోజులు వస్తయ్ అని బండిసంజయ్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందని, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడ్డరని మా దగ్గర సమాచారం ఉందని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ ఎందుకు జరపడం లేదు? అని ప్రశ్నించారు.  బియ్యం అక్రమాలపై గతంలో కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తే విచారణ జరిపితే నిజమేనని తేలినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.

”కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేసీఆర్… నీకు వచ్చిన ఇబ్బందేమిటి? అంత అక్కసు ఎందుకు? నీకు నచ్చేది కేడీ నెంబర్ వన్… మోసగాళ్లకు మోసగాడు వంటివే కదా… 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్ లో జరిగిన నష్టమేందో తెలుసుకో… కాశ్మీర్ పండిట్లపై జరిగిన ఉచకోతపై వాస్తవ విషయాలను ప్రజలకు చూపిస్తే… జనం ఆలోచనలో పడితే… దీనిని పనికిమాలిన సినిమా అంటూ పనికిమాలిన బుద్దలు చూపిస్తవా?” అని బండి సంజయ్ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement