Thursday, April 25, 2024

ఈటల బీజేపీలో చేరిక ఎప్పుడు ?.. బండి ఎమన్నాడంటే..

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీ ఆగ్ర నాయకులను కలిసి వచ్చిన ఈటల.. తన నియోజకవర్గంలోని ప్రజలు, అనుచరులతో చర్చలు జరిపారు. బీజేపీలో చేరితే తనకు లభించే ప్రాధాన్యత, గౌవరంపై తన మద్దతుదారులకు క్లుప్తంగా వివరించినట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీలో ఈటల ఎప్పుడు చేరుతారనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. తొలుత ఈ నెల 13వ తేదీన చేరుతారని ప్రచారం జరిగింది. ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువ కప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే, బీజేపీలో ఈటెల రాజేందర్ చేరికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. ఈటల చేరిక తేదీపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని బండి సంజయ్​ తెలిపారు. ఈ నెల 13 లేదా 14న చేరాలని ఈటల నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ రెండు రోజుల్లో నడ్డా అపాయింట్ మెంట్ దొరికితే ఈటల ఆయన సమక్షంలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన ఈటల.. రెండు రోజుల్లోనే స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను అందివ్వనున్నట్లు సమాచారం. ఇందుకనుగుణంగా స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కోరనున్నట్లు ఈటల సన్నిహిత నేతలు చెబుతున్నారు. అయితే, స్పీకర్ పోచారం మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.

మరోవైపు ఇప్పటికే హుజురాబాద్ నియోజకర్గంలో పర్యటిస్తున్నారు. రాజీనామా అనంతరం తొలిసారిగా హుజురాబాద్ కి వచ్చిన ఈటలకు అభిమానులు, ప్రజల నుంచి భారీగా మద్దతు లభించింది. అంతేకాదు, తన రాజీనామా ఆమోదం పొందే అవకాశం ఉండడంతో ఈటల ప్రజల్లోకి వెళ్లారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించే పనిలో ఉన్నారు. ఇక, ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రూ.50 కోట్లు ఖర్చుపెట్టిందని ఈటల తెలిపారు. మంత్రి హరీష్‌రావు తనకంటే ఎక్కువగా అవమానాలకు గురయ్యారని చెప్పారు. అవమానాలు పడుతున్న మాజీ ఎమ్మెల్యేలు తనతో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement