Saturday, May 18, 2024

Spl Story: ఎవ‌రీ అల్ జ‌వ‌హ‌రి.. అమెరికా అతడిని ఎందుకు చంపాల్సి వచ్చింది?

అయ్‌మ‌న్ అల్ జ‌వ‌హ‌రి.. ఇతడు ఆల్‌ఖ‌యిదా ఐడియాల‌జీ సృష్టిక‌ర్త‌. అమెరికా చేపట్టిన స్పెషల్​ ఆపరేషన్​ నింజా డ్రోన్ అటాక్​లో హతమయ్యాడు. వృత్తిరీత్యా కంటి డాక్టర్​. ఈజిప్ట్‌లో ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపును స్థాపించాడు. 2011లో అమెరికా దాడిలో ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన సంగతి అందరికీ తెలిసిదే. ఆ త‌ర్వాత ఆల్‌ఖైయిదా నాయ‌క‌త్వాన్ని జవహరి చూసుకుంటున్నాడు. బిన్ లాడెన్ బతికి ఉన్న స‌మ‌యంలో అత‌నికి రైట్‌హ్యాండ్ గా ఉండేవాడు. 2001లో అమెరికాపై జ‌రిగిన వైమానిక దాడుల వ్యూహాక‌ర్త కూడా అల్ జ‌వ‌హ‌రినే. సెప్టెంబ‌ర్ 11 దాడుల‌తో అగ్ర‌రాజ్యం అత‌లాకుత‌లం అయ్యింది. ఆ దాడి త‌ర్వాత మోస్ట్ వాంటెడ్ లిస్టులో బిన్ లాడెన్ త‌ర్వాత రెండో స్థానంలో జవహరి ఉన్నాడు. జ‌వ‌హ‌రి త‌ల‌పై 25 మిలియ‌న్ల డాల‌ర్ల న‌జ‌రానా కూడా ఉంది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

ఆల్‌ఖ‌యిదా రిక్రూట్మెంట్‌లో అల్​ జవహరీదే కీల‌క పాత్ర. త‌న వీడియో మెస్సేజులతో ముస్లిం యువ‌త‌ను ప్రేరేపించేవాడు. విప్ల‌వ భావాల‌తో ముస్లిం లోకాన్ని ఆల్‌ఖ‌యిదా వైపు మ‌ళ్లించాడు. ఈజిప్టు రాజ‌ధాని కైరోలో 19 జూన్ 1951లో అల్ జ‌వ‌హ‌రి జ‌న్మించారు. డాక్ట‌ర్లు, స్కాల‌ర్లు ఉన్న మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టాడ‌త‌ను. తాత ర‌బియా అల్ జ‌వ‌హ‌రి.. సున్నీ ఇస్లామిక్ వ‌ర్సిటీలో ఇమామ్‌గా చేశాడు. స్కూల్ ద‌శ‌లో ఇస్లామిక్ రాజ‌కీయ‌వేత్త‌గా మారారు. ముస్లిం బ్ర‌ద‌ర్‌వుడ్‌లో స‌భ్య‌త్వం తీసుకోవ‌డం వ‌ల్ల 15 ఏళ్ల‌కే అరెస్టు అయ్యాడు. కైరో మెడిక‌ల్ స్కూల్ వ‌ర్సిటీలో మెడిస‌న్ చ‌దివాడు. 1974లో గ్రాడ్యుయేష‌న్‌, ఆ త‌ర్వాత నాలుగేళ్ల‌కు మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి మొహ‌మ్మ‌ద్ ఫార్మ‌కాల‌జీ ప్రొఫెస‌ర్‌గా ఉండేవాడు.

తొలుత కైరోలో మెడిక‌ల్ క్లినిక్ స్టార్ట్ చేసిన జ‌వ‌హ‌రి ఆ త‌ర్వాత రాడిక‌ల్ ఇస్లామిక్ గ్రూపు వైపు ఆక‌ర్షితుడ‌య్యాడు. 1981లో అధ్య‌క్షుడు అన్వ‌ర్ సాద‌త్ హ‌త్య స‌మ‌యంలో ఇస్లామిక్ తీవ్ర‌వాదుల్ని అరెస్టు చేశారు. ఆ స‌మ‌యంలో జ‌వ‌హ‌రి ఓ నేత‌గా ఎదిగాడు. ఇస్లామిక్ స్టేట్‌, ఇస్లామిక్ సొసైటీ స్థాప‌న‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు అత‌ను కోర్టుకు కూడా తెలిపాడు.అధ్య‌క్షుడు సాద‌త్ హ‌త్య కేసు నుంచి అల్ జ‌వ‌హ‌రి బ‌య‌ట‌ప‌డ్డా.. అక్ర‌మ రీతిలో ఆయుధాలు క‌లిగిన కేసులో అత‌ను మూడేళ్ల జైలు శిక్ష అనుభ‌వించాడు. 1985లో జైలు నుంచి రిలీజైన జ‌వ‌హ‌రి ఆ త‌ర్వాత సౌదీ అరేబియాకు వ‌ల‌స వెళ్లాడు. ఆ త‌ర్వాత పాకిస్థాన్ చేరుకున్నాడు. మ‌ళ్లీ అక్క‌డ నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్‌కు వెళ్లాడు.

1993లో ఈజిప్టియ‌న్ ఇస్లామిక్ జిహాద్‌కు మ‌ళ్లీ నాయ‌క‌త్వం వ‌హించాడు. ఎన్నో దాడుల‌కు రూప‌క‌ల్ప‌న చేశాడు. ఇస్లామిక్ స్టేట్ స్థాప‌న ల‌క్ష్యంతో వేలాది మంది ఈజిప్టియ‌న్ల‌ను ఊచ‌కోత కోశారు. 1990 ద‌శ‌కంలో జ‌వ‌హ‌రి ప్ర‌పంచ టూర్ చేసిన‌ట్లు భావిస్తున్నారు. ఆశ్ర‌యం, నిధుల కోసం అత‌ను తిరిగిన‌ట్లు తెలుస్తోంది. ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి సోవియేట్ వైదొలిగిన స‌మ‌యంలో అత‌ను అనేక దేశాల‌కు వెళ్లాడు. 1996లో స‌రైన వీసా లేని కేసులో చెచాన్యాలో అత‌న్ని ర‌ష్యా అరెస్టు చేసింది. 1997లో ఆఫ్ఘ‌న్‌లోని జ‌లాలాబాద్‌కు వెళ్లాడు. అక్క‌డే ఒసామా బిన్ లాడెన్‌తో బేస్ ఏర్ప‌ర్చుకున్నాడు.

- Advertisement -

ఈజిప్ట్ ఇస్లామిక్ జిమాద్‌తో పాటు మ‌రో అయిదు ర్యాడిక‌ల్ ఇస్లామిక్ సంఘాలు, బిన్ లాడెన్ ఆల్ ఖ‌యిదా ఒక్క‌ట‌య్యాయి. యూదులు, క్రుసేడ‌ర్ల‌కు వ్య‌తిరేకంగా వ‌ర‌ల్డ్ ఇస్లామిక్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి జిహాదీకి పాల్ప‌డ్డారు. అమెరికా పౌరుల్ని చంపాల‌ని ఆ ఫ్రంట్ ఓ ఫ‌త్వా జారీ చేసింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా అమెరికా ఎంబ‌సీల‌ను టార్గెట్ చేశారు. 2001లో ఏకంగా అమెరికా డ‌బ్ల్యూటీసీ ట్విన్ ట‌వ‌ర్స్‌ను విమానాల‌తో పేల్చేసిన ప్లాన్ వేసింది కూడా జ‌వ‌హ‌రినే. ఆఫ్ఘ‌నిస్తాన్ కాల‌మానం ప్ర‌కారం గ‌త శ‌నివారం ఉద‌యం 6.18 నిమిషాల‌కు బైడెన్ ఆదేశాలతో అల్ జ‌వ‌హ‌రిని మిస్సైల్ దాడితో చంపేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement