Monday, April 29, 2024

భారీ రేంజ్‌లో విడుద‌లైన అవ‌తార్ 2.. విజువల్ వండర్ అంటోన్న ప్రేక్షకులు

నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అవ‌తార్ 2 భారీ రేంజ్‌లో విడుద‌లైంది. మ‌రి ఈ సినిమా ప్రేక్షకుల‌ను ఎలా ఆక‌ట్టుకుంది అనే విష‌యాలు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

క‌థ ఏంటంటే.. జేక్ (సామ్ వ‌ర్తంగ్ ట‌న్‌) పండోరా గ్ర‌హ వాసుల‌కు మ‌ద్దతుగా పోరాటం చేసి వారిలో మ‌నిషిగా మారిపోతాడు. అక్క‌డి నాయ‌కుడు కుమార్తె నేతిరి (జో స‌ల్దానా)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ గ్ర‌హ వాసుల‌కు నాయ‌కుడ‌వుతాడు. జేక్‌, నేతిరి ఇద్ద‌రు కొడుకులు నేటియం, లోక్‌, ఓ కూతురు టూక్‌ పుడ‌తారు. వీరు కాకుండా కిరి అనే అమ్మాయిని, స్పైడ‌ర్ అనే అబ్బాయిని ద‌త్త‌త తీసుకుని పెంచుకుంటారు. అంద‌రూ ఆనందంగా స‌మ‌యాన్ని గ‌డుపుతున్న స‌మ‌యంలో మ‌ళ్లీ మ‌నుష‌లు పండోరా గ్ర‌హాన్ని ఆక్ర‌మించుకోవాల‌ని దండెత్తుతారు. జేక్ కుటుంబాన్ని మైల్స్ (స్టీఫెన్ లాంగ్‌) టార్గెట్ చేస్తాడు. దీంతో త‌న కార‌ణంగా పండోరా గ్ర‌హ వాసులు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని జేక్ కుటుంబంతో స‌హా దూరంగా ఉండే మెట్క‌యినా అనే మ‌రో ప్రాంతానికి వెళ‌తాడు. అక్క‌డి వారందంరూ నీటిలోనే జీవిస్తుంటారు. ముందు జేక్ కుటుంబాన్ని చేర్చుకోవాలా వ‌ద్దా అని సంశ‌యించిన వారు చివ‌ర‌కు ఒప్పుకుంటారు. నీటిలో ఎలా ఉండాలి.. అక్క‌డి జీవుల‌ను ఎలా మంచి చేసుకోవాలి తెలుసుకుని అనుబంధం పెంచుకుంటారు. జేక్ కుటుంబాన్ని వెతుక్కుంటూ మైల్స్ మెట్క‌యినా గ్రామానికి వ‌స్తాడు. అక్క‌డి వారిని ఇబ్బంది పెడ‌తాడు. జేక్స్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మైల్స్ చేసే యుద్ధంపై జేక్స్‌కి తోడుగా మెట్క‌యినా రాజు, ప్ర‌జ‌లు అండ‌గా నిల‌బ‌డ‌తారు. అస‌లు జేక్స్ కుటుంబాన్ని మైల్స్ ఎందుకు టార్గెట్ చేస్తాడు చివ‌ర‌కు జేక్స్ యుద్ధంలో ఏం కోల్పోయాడు.. ఏం సాధించాడు అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌.. అవ‌తార్ 2లో జేమ్స్ కామెరూన్ కాస్త తాత్విక‌త‌ను జోడించే ప్ర‌య‌త్నం చేశారు. భూమి మూడు వంతుల నీరుంది. ఒక వంతు మాత్ర‌మే భూ భాగం ఉంది. అంటే ఇవ‌న్నీ ఒక‌ప్పుడు క‌లిసే ఉన్నాయ‌ని అప్పుడు మ‌నిషి నీటిలోనే జీవించే వాడ‌ని.. నీటికి, మ‌నిషికి విడ‌దీయ‌రాని అనుబంధం ఉంద‌ని అవ‌తార్ 2లో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు జేమ్స్ కామెరూన్‌. అవ‌తార్ సినిమాలో పండోరా అనే అంద‌మైన గ్ర‌హం.. దాని అందాల‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్క‌రించిన జేమ్స్ కామెరూన్ .. అవ‌తార్ 2ని నీటిలో ఉండే అందాలు, జ‌ల‌చ‌రాలు, వాటికి మ‌నుషుల‌తో ఉండే అనుబంధాల‌ను ఆవిష్క‌రించారు. సాధార‌ణంగా ప్ర‌తి సినిమాను విజువ‌ల్ వండ‌ర్‌గా చూపించే జేమ్స్ కామెరూన్ అవ‌తార్ 2లో నీటిలో అందాల‌ను అద్బుత‌మైన విజువ‌ల్స్‌తో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. వైవిధ్య‌మైన జంతులు, చిన్న చిన్న అంద‌మైన చేప‌లు, భారీ జ‌ల‌చ‌రాలు ఇలాంటి బ్యూటీని త్రీడీ టెక్నాల‌జీతో అవ‌తార్ 2ను చూస్తుంటే మ‌నం మ‌రేదో లోకంలో ఉన్నామ‌ని ఫీలింగ్ త‌ప్ప‌కుండా క‌లుగుతుంది.

- Advertisement -

సినిమా ఎలా ఉందంటే.. అవ‌తార్ 2లో నీటికి మ‌నిషితో ఉన్న అనుబంధాన్ని సెంక‌డాఫ్ ముందు నుంచే చూపించారు. ఫ‌స్టాఫ్‌లో దాదాపు ఎక్కువ శాతం పండోరా గ్ర‌హం మీద‌నే క‌థ న‌డుస్తుంది. అవ‌తార్ కంటే అవ‌తార్ 2లో క‌థ‌లో ఎమోష‌న‌ల్ క‌నెక్టింగ్ పాయింట్ క‌నిపించ‌దు. పండోరా గ్ర‌హ వాసుల కోసం అవ‌తార్‌లో హీరో పోరాడితే.. అవ‌తార్ 2లో మాత్రం కుటుంబం పెద్ద‌గా కుటుంబంలోని వ్య‌క్తుల కోసం బాధ్య‌త‌గా పోరాడే తండ్రి పాత్ర‌లో క‌థానాయ‌కుడు క‌నిపించారు. సినిమాలోని ఎమోష‌న‌ల్ కంటెంట్ సెకండాఫ్‌లోనే క‌నిపిస్తుంది. సముద్ర జీవుత‌లో జేక్స్ కుటుంబం స్నేహం చేయ‌టం అవే క్లైమాక్స్‌లో అత‌ని కుటుంబాన్ని కాపాటం అనే దాన్ని చూపిస్తారు. ఇక అవ‌తార్ 2లో మెయిన్ విల‌న్ చావ‌డు. అంటే అవ‌తార్ 3కి అత‌నికి లింక్ ఉంటుంద‌నే హింట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్‌. సినిమా నిడివి మూడు గంటల పన్నెండు నిమిషాలుగా ఉంది. చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఇక ఫస్టాఫ్ విజువల్‌గా బాగానే ఉంది కానీ ప్రేక్షకుడు ఎగ్జయిట్ అయ్యేంతగా అనిపించదు. సెకండాఫ్‌లోనే అసలు కథ రన్ అవుతుంది. మొత్తానికి ఈ చిత్రం విజువల్ వండర్ అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement