Monday, April 29, 2024

Followup: మోగిన బడిగంట, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల‌లో హాజరు చాలా పూర్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట మోగింది. వేసవి సెలవులు ముగియడంతో సోమవారం పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ 41,392 పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు మళ్లిd పుస్తకాల బ్యాగులు భుజాన వేసుకొని హుషారుగా పాఠశాలలకు వెళ్లారు. తమ పిల్లలను తల్లిదండ్రులు సైతం సంతోషంగా స్కూళ్లకు పంపించారు. మొదటి రోజు కావడంతో చాలా మంది పేరెంట్స్‌ తమ పిల్లలను స్కూళ్లకు పంపించలేదు. దీంతో మొదటి రోజు హాజరు శాతం చాలా తక్కువగా నమోదైందని అధికారులు చెప్తున్నారు.

అయితే మొదటి రోజు వెళ్లిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు వివిధరకాల సమస్యలతో స్వాగతం పలికాయి. ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పినా అందుకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. సరైనా మౌలిక వసతులు లేవు. మన ఊరు-మన బడి కింద ఎంపికైన చాలా బడుల్లో ఇంకా పనులు పూర్తి కాలేదు. కొన్ని స్కూళ్లల్లో ఇంకా పనులు ప్రారంభం కాలేదని తెలుస్తోంది. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.7289.54 కోట్లతో దశల వారీగా ప్రభుత్వ స్కూళ్లల్లో 12 రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో భాగంగా 9123 పాఠశాలల్లో రూ.3,497.67 కోట్లతో పనులు చేపడుతున్నారు.

అయితే పాఠశాలల్లో పనులు ఎంతవరకు పూర్తయ్యాయో అనేదానిపై స్పష్టత లేదు. అధికారులు సైతం ఈ విషయాన్ని గోప్యంగా దాచుతున్నారు. పూర్తి స్థాయిలో పుస్తకాలు విద్యార్థులకు ఇంకా అందలేదు. యూనిఫామ్స్‌ ఇవ్వలేదు. విద్యావాలంటీర్లను నియమించి పరిష్కారించాల్సిన సబ్జెక్టు టీచర్ల సమస్యను పరిష్కరించలేదు. ప్రైవేట్‌ స్కూళ్లతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థల సంఖ్య తక్కువగా నమోదైనట్లు సమాచారం. మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేయలేదని తెలుస్తోంది. అయితే మిడ్‌ డే మీల్స్‌ హాజరు శాతం మాత్రం 30 శాతం వరకు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కొన్ని జిల్లాల్లో ఇంకా మన ఊరు-మన బడి పనులు పూర్తికాలేదు. విడతల వారీగా చేపడుతుండటంతో పూర్తి స్థాయిలో బడుల్లో మౌళికవసతులు ఏర్పాటు చేయాలంటే ఇంకా రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, భద్రాచలం లాంటి మారు మూల జిల్లాల్లోని స్కూళ్లల్లో తరగతి గదులు, టాయిలెట్స్‌ సరిగా లేవని తెలిసింది.

కొన్ని బడుల్లో పండుగ వాతావరణం…
కొన్ని బడుల్లో మాత్రం మొదటి రోజు పండగ వాతావరణం కనిపించింది. విద్యార్థుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. ఖమ్మంతోపాటు మరికొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలు, రంగు కాగితాలతో అలంకరించినట్లు తెలిసింది. కొన్ని చోట్ల తెలుగు మీడియం, ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులను కలిపి కూర్చోబెట్టినట్లు తెలిసింది. ఉన్న వసతులతోనే విద్యార్థులకు పాఠాలు చెప్పారు. చాలా స్కూళ్లల్లో కరోనా నిబంధనలు పాటించలేదు. విద్యార్థులు, స్టాఫ్‌ మాస్కులు ధరించలేదు. హైదరాబాద్‌ బోరబండ, ఖైరతాబాద్‌ రాజ్‌భవన్‌ లాంటి ప్రభుత్వ స్కూళ్లల్లో అడ్మిషన్లు భారీగా వస్తే, కొన్ని స్కూళ్లల్లో తక్కువగా నమోదయ్యాయి. జిల్లాల్లో కొన్ని చోట్ల టీచర్లు ఆలస్యంగా వచ్చారు. పారిశుద్ధ్య కార్మికల సమస్య ఇంకా అలాగే మిగిలి ఉంది. మొత్తానికి మొదటి రోజు అరకొర వసతుల నడుమ స్కూళ్లు తెరుచుకున్నాయి.

కొత్తగా చేరినవారు 79వేలు…
బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 79,635 కొత్త అడ్మిషన్లు ప్రభుత్వ బడుల్లో నమోదయ్యాయి. సోమవారం రోజు 8937 మంది ప్రవేశాలు పొందారు. ప్రీప్రైమరీ తరగతుల్లో చేరిన వారు కేవలం 201 మందే ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రైవేట్‌ స్కూళ్లు, నేరుగా ఒకటో తరగతిలో చేరిన వారు 6490 మంది ఉన్నారు. రెండు నుంచి 12వ తరగతి వరకు అడ్మిషన్లు పొందిన వారు 2246 మంది ఉన్నారు.

- Advertisement -

ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ బడులకు వలసలు: మంత్రి సబిత
విద్యా సంవత్సరం ప్రారంభ మొదటి రోజు హైదరాబాద్‌లోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను నెలకొల్పుతున్నామని స్పష్టం కేశారు. ప్రైవేట్‌ బడుల నుంచి ప్రభుత్వ బడులకు వలసలు పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 75వేలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. మౌళిక సదుపాయాలు, ఇంగ్లీష్‌ మీడియంను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై భరోసా కల్పించే విధంగా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement