Tuesday, May 7, 2024

Drug case: ఆర్యన్ ఖాన్ కేసులో ట్విస్ట్… దర్యాప్తు అధికారి వాంఖడే తొలగింపు

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న ముంబై క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్‌ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నార్కోటిక్‌ కంట్రోల్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణల కారణంగా ఈ కేసు దర్యాప్తు నుంచి ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేను తప్పిస్తూ ఎన్‌సీబీ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో విచారణాధికారిగా సంజయ్‌ సింగ్‌ను నియమించారు. వాంఖడేను ఢిల్లీలో ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఇకపై ఆర్యన్‌ఖాన్‌ కేసు సహా మొత్తం ఆరు డ్రగ్‌ కేసులను సంజయ్‌ సింగ్‌ నేతృత్వంలో ఎన్‌సీబీ సెంట్రల్‌ యూనిట్‌ దర్యాప్తు చేయనుంది.

అవినీతి ఆరోపణలు రావడంతోనే సమీర్ వాంఖడేను తప్పించినట్టు తెలుస్తోంది. అక్టోబరు 3న ముంబయి తీరంలోని క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతుండగా ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆర్యన్ ఖాన్‌ సహా పలువుర్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారి వద్ద డ్రగ్స్ లభించినట్టు ఎన్‌సీబీ పేర్కొంది. అయితే, ఆర్యన్‌ను కేసు నుంచి తప్పించాలంటే రూ.8 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వాంఖడే ఆరోపణలు ఉన్నాయి.

ఇక, డ్రగ్స్‌ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వాంఖడేను టార్గెట్‌ చేస్తూ మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ విమర్శలు చేశారు. బెదిరింపుల ద్వారా సమీర్ వాంఖడే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని, వసూళ్ల కోసం ప్రయివేట్ ఆర్మీని నియమించారని మంత్రి మాలిక్ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: COVID-19: ‘కొవాగ్జిన్‌’ తీసుకున్న అమెరికాలోకి ఎంట్రీ!

Advertisement

తాజా వార్తలు

Advertisement