Saturday, May 18, 2024

మ‌రోసారి అర్పితా ముఖ‌ర్జీ ఇంట్లో సోదాలు-రూ.28 కోట్ల న‌గ‌దు..5కిలోల బంగారం స్వాధీనం

మంత్రి పార్థ‌ఛ‌ట‌ర్జీ టీచ‌ర్ రిక్రూర్ట్ మెంట్ కేసులో ప‌లు మ‌లుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్ప‌టికే మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ ఇంట్లో ఇప్పటికే రూ. 21. 20 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోగా. తాజాగా ఆమెకు చెందిన కోల్‌కోతాలోని బెల్ఘరియా ఫ్లాట్ నుంచి దాదాపు రూ. 28 కోట్ల నగదు, 5 కిలోల బంగారు ఆభరణాలు, భూములకు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు బుధవారం సాయంత్రం అర్పిత నివాసం‌ ఇంటి తాళాన్ని పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అయితే వారు అక్కడ భారీగా నగదు కనుగొన్నారు. ఆ నగదును లెక్కించడానికి వారు వెంటనే కోల్‌కతాలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించారు. అరగంట వ్యవధిలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన నలుగురు అధికారులు ఒకేసారి 1,000 నోట్లను లెక్కించగల నాలుగు జంబో కరెన్సీ లెక్కింపు యంత్రాలతో వచ్చారు. దాదాపు 8 గంటల పాటు ఆమె నివాసంలో తనిఖీలు చేపట్టినట్టుగా నివేదికలు సూచిస్తున్నాయి.

ఆమె నివాసంలో పట్టుబడ్డ దాదాపు రూ.28 కోట్ల నగదుతో 10 ట్రంక్‌లను నింపిన తర్వాత ఈడీ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ట్రంక్‌లను అక్కడి నుంచి తరలించారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. గదుల్లోనే కాదు, ఫ్లాట్‌లోని బాత్రూమ్‌లో కూడా డబ్బు దాచి ఉంచారని.. వాటిని కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నారని సమాచారం. తాజా సోదాల్లో లభించిన మొత్తంతో అర్పితా ముఖర్జీ రెండు నివాసాల్లో లభించిన నగదు దాదాపు రూ. 50 కోట్లుగా ఉంది. దీంతో అర్పితా ముఖర్జీని మరింత కష్టాల్లో పడినట్టయింది. ఇక, ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు.. గత శనివారం రోజున అర్పితా ఛటర్జీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement