Monday, April 29, 2024

Job Recruitment | మే నెలలో తగ్గిన నియామకాలు.. ఫౌండిట్‌ నివేదిక వెల్లడి!

దేశంలో ఈ సంవత్సరం మే నెలలో ఉద్యోగ నియామకాలు 7 శాతం తగ్గాయి. అంతర్జాతీయంగా ఆర్ధిక వ్యవస్థల మందగమనం ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపుతోంది. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలన్న నిర్ణయంలో భాగంగా కొత్త ఉద్యోగులకు రిక్రూట్‌ చేసుకోవడంలేదు. నెలవారీగా ఉద్యోగ నియామకాల ధోరణులపై ఫౌండిట్‌ ఒక నివేదికను విడుదల చేసింది. గత సంవత్సరం మే నెలతో పోల్చితే 7 శాతం, ఏప్రిల్‌ నెలతో పోల్చితే 4 శాతం ఉద్యోగాలు తగ్గాయని ఈ సంస్థ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్‌లో 8 శాతం జైపూర్‌లో 1 శాతం నియామకాలు పెరిగాయని పేర్కొంది.

దేశంలో అవసరాలకు తగిన నైపుణ్యాలు ఉన్న అభ్యర్ధులు కంపెనీలకు లభించడంలేదని, నియామకాలు తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని నివేదిక తెలిపింది. ప్రస్తుత ఉద్యోగ నియామక ధోరణులు జాబ్‌ మార్కెట్‌ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తున్నాయని తెలిపింది. ఈ విషయంలో సవాళ్లు ఉన్నప్పటికీ, వృద్ధిబాటలో నడుస్తున్న కొన్ని రంగాల్లో ఉద్యోగ నియామకాలు బాగానే ఉన్నాయని పేర్కొంది. ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు, షిప్పింగ్‌, ప్రకటనలు, పబ్లిక్‌ రిలేషన్స్‌, రిటైల్‌, టూరిజం లాంటి రంగాల్లో నియామకాలు పెరిగాయని ఫౌండిట్‌ సీఈఓ శేఖర్‌ గరిసా తెలిపారు.


ప్రస్తుతం కొత్త ఉద్యోగ అవకాశాలు తగ్గినప్పటికీ, భవిష్యత్‌లో ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అయితే అన్ని రంగాల్లోనూ నియామకాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. నైపుణ్యం ఉన్న వారికి కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా నైపుణ్యాలను పెంచుకునేందుకు అభ్యర్ధులు ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఈ ఏడాది బెంగళూర్‌లో నియామకాలు 24 శాతం క్షీణించాయి. ఢిల్లి ఎన్‌సీఆర్‌ ప్రాంతం, పుణే, హైదరాబాద్‌లోనూ గత సంవత్సరంతో పోల్చితే నియామకాలు 9-16 శాతం తగ్గాయి.


అదే సమయంలో దేశంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కూడా భారీగా తగ్గాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఒక్క కేంద్రంలోనే 20 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రైల్వేల్లో 3 లక్షల వరకు ఖాళీగా ఉన్నాయి. ఇక రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దేశ ఆర్ధిక వృద్ధికి తగిన విధంగా ఉద్యోగ కల్పన జరగడంలేదని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -


ఉపాధి రహిత అభివృద్ధి తీవ్రమైన అసమానతలకు దారి తీస్తుందని ఆర్ధిక రంగ నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. కనీసం ప్రభుత్వం తన చేతుల్లో ఉన్న ఉద్యోగాలనైనా భర్తీ చేస్తే, దేశంలో కుటుంబాల సగటు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ కల్పన పెరిగితే, వినియోగం అదే స్థాయిలో పెరుగుతుందని, ఆర్ధిక వ్యవస్థకు ఇది ఎంతో దోహదం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక తాజాగా ఐటీ రంగంలో వస్తున్న కృత్రిమ మేధ మూలంగా రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాల్లో కోత పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలన్నీంటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని వీరు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement