Saturday, May 18, 2024

ఏసీలు, కూలర్లన్నీ ఆన్ చేస్తున్నరు.. వేసవి ప్రారంభంలోనే పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఏటా విద్యుత్‌ వినియోగం పెరుగుతున్నది. విద్యుత్‌ కనెక్షన్లు, అవసరాలు పెరగడంతో ఈ ఏడాది కూడా వేసవి ప్రారంభానికి ముందే రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ అత్యధిక స్థాయిలో పెరుగుతున్నది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఉమ్మడి ఏపిలోని విద్యుత్‌ వాడకం రికార్డును కూడా అధిగమించే దిశగా తెలంగాణ విద్యుత్‌ శాఖ దూసుకుపోతోంది. విద్యుత్‌ వినియోగంలో అత్యధిక రికార్డును త్వరలో నమోదుకానుందని విద్యుత్‌ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాదిలో మార్చి మొదటి వారానికి 13,221 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం నమోదు కాగా.. ఈ ఏడాదిలో అదే సమయానికి పాత రికార్డులను చెరిపేస్తూ 13,539 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం నమోదుతో అత్యధిక రికార్డును సాధించింది. ఈ నెలాఖరులోగా 14 వేల మెగావాట్ల విద్యుత్‌ వినియోగం దాటే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

గతేడాది ఫిబ్రవరి నాటికి 13,252 మెగావాట్లు..
గతేడాది 2021 ఫిబ్రవరి 28 తేదీ నాటికి 13,252 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదు కాగా, 2020 ఫిబ్రవరి 28న 13,168 మెగావాట్లుగా నమోదయ్యింది. ఉమ్మడి ఏపీలో 2014 మార్చి 23న అత్యధికంగా 13,162 మెగావాట్ల కరెంటును వాడగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అంతకుమించి విద్యుత్‌ డిమాండ్‌ నమోదు కావడం గమన్హారం. రాష్ట్రం ఏర్పడే నాటికి మొత్తం కరెంటు కనెక్షన్లు 1.11 కోట్లు ఉండగా ప్రస్తుతం 1.54 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో ఎండాకాలం ప్రారంభం కాకముందే రాష్ట్రంలో కరెంట్‌ డిమాండ్‌ పెరుగుతోందని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరో 50 లక్షల గృహ అవసరాలకు సంబంధించిన కనెక్షన్లు పెరిగే అవకాశం ఉండడంతో విద్యుత్‌ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పెరుగుతోంది. దీంతో మార్చి తొలివారం నుంచి కరెంటు వినియోగం 14 వేల మెగావాట్లు దాటే అవకాశం ఉందని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు.

పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా కార్యాచరణ..
పెరుగుతున్న విద్యుత్‌ వినియోగానికి అనుగుణంగా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు విద్యుత్‌ శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దానికి అవసరమయ్యే నిధుల అంచనా రూపొందించడంతో పాటు కమిషన్‌ మార్గనిర్ధేశకాల ప్రకారంగా ప్రణాళికలను రచిస్తోంది. ప్రధానంగా లోడు పెరుగుదలను అధిగమించేందుకు ప్రత్యేకంగా విద్యుత్‌ ఉపకేంద్రాలను నెలకొల్పాలని విద్యుత్‌ శాఖ నిర్ణయించింది. ఈ ఉపకేంద్రాల్లో అదనంగా ముందస్తు పరీక్ష నివేదికలను అందించే ప్రక్రియను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్ష నివేదికల సామర్థాన్ని పెంపొందించడం, అదనంగా ఫీడర్ల ఏర్పాటు, అదనపు పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్‌ శాఖ నిర్ణయించింది. గరిష్ట లోడును పరిగణలోకి తీసుకొని అదనపు సాంకేతిక వ్యవస్థను నెలకొల్పే పనిలో అధికారులు ముందుకెళుతున్నారు. అయితే, విద్యుత్‌ నష్టాలను తగ్గించడం కొరకు ఉత్తమ నాణ్యత మీటర్లను ఏర్పాటు, ప్రస్తుతమున్న కండక్టర్‌ను అధిక సామర్థమున్న కండక్టర్‌లను మార్చడం వంటివి చేపట్టాలన్న ఆలోచనలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

తలసరి విద్యుత్‌ వినియోగంలో 11.34 శాతం వృద్ధి..
ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్‌ వినియోగం జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా 10 శాతం వృద్ధిరేటు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 2017-18 సంవత్సరంలో తెలంగాణలో తలసరి విద్యుత్‌ వినియోగం 1,727 యూనిట్లుంటే, 2018-19 నాటికి 1,896కి చేరింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా తలసరి విద్యుత్‌ వినియోగం 2.7 శాతం మాత్రమే వృద్ధి సాధించడం విశేషం. 2017-18లో దేశ సగటు తలసరి విద్యుత్‌ వినియోగం 1,149 యూనిట్లుంటే, 2019-20లో 1,181 యూనిట్లుగా నమోదైంది.

2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 13,162 మెగావాట్ల డిమాండ్‌..
విద్యుత్‌ గరిష్ట డిమాండ్‌ వృద్ధి రేటులోనూ రాష్ట్రం గణనీయమైన వృద్ధి శాతం నమోదు చేసింది. 2016- 17లో తెలంగాణలో 9,187 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదు కాగా, 2017-18 సంవత్సరంలో అది 10,284 మెగావాట్లకు చేరింది. అలాగే, 2018-19లో తెలంగాణలో 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదు కాగా, 2019-20 సంవత్సరంలో 11,703 మెగావాట్లకు చేరింది. 28 ఫిబ్రవరి, 2020న ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో 13,168 మెగావాట్ల అధిక విద్యుత్‌ డిమాండ్‌ ఏర్పడింది. 23 జిల్లాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే 23వ తేదీ మార్చి, 2014 సంవత్సరంలో 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ వినియోగం జరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి ఎస్‌పీడీసీఎల్‌, ఎన్‌పిడిసిఎల్‌ పరిధిలోని తెలంగాణ ప్రాంతంలో 5,661 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదైంది. తెలంగాణ వచ్చిన నాటి పరిస్థితితో పోల్చుకుంటే ప్రస్తుతం డిమాండ్‌ 142.6 శాతం అధికమని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement