Saturday, May 4, 2024

Big Story: అందరి చూపు ఓబీసీల వైపు.. ఆకట్టుకునే యత్నాల్లో ప్రధాన పార్టీలు

స్వరూప పొట్లపల్లి, ఆంధ్రప్రభ ఢిల్లీ బ్యూరోచీఫ్

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీలూ ఓబీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్టీల గెలుపోటములను నిర్ణయించే ఓబీసీ ఓట్ల కోసం ప్రధాన పోటీదారులైన బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థుల జాబితాలో ఓబీసీలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. ప్రతి పార్టీకి సాంప్రదాయ ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ, కేవలం ఆ ఓట్లతో గెలిచే పరిస్థితి లేదు. ఏ పార్టీకి సాంప్రదాయ ఓటుబ్యాంకుగా లేని ఓబీసీల మద్ధతు ఎవరికి లభిస్తుందో వారికి అధికార పీఠం వరిస్తుంది. యూపీలో 2014 నుంచి జరిగిన సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయాల వెనుక ఓబీసీ ఓటర్లదే ప్రధాన పాత్ర అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా ఓబీసీ అన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఓవైపు, కేంద్ర మంత్రివర్గంలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఏకంగా 27 మంది ఓబీసీ నేతలకు చోటు కల్పిస్తూ మరోవైపు బీజేపీ ఓబీసీలకు మరోసారి గాలం వేసే ప్రయత్నం చేస్తోంది. తాజా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో సైతం ఓబీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ మరోసారి వారి మద్ధతుతో అధికార పీఠాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.

యాదవేతర ఓబీసీలే కీలకం
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో అగ్రవర్ణాల నేతల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న సమయంలో జనతా దళ్ నుంచి చీలి సమాజ్‌వాదీ పార్టీ ఆవిర్భవించింది. అప్పటి వరకు రాజకీయాల్లో ప్రాధాన్యత లేని అన్ని వర్గాలను కలుపుకుంటూ రాజ్యాధికారం కూడా సాధించింది. 3 దశాబ్దాల పార్టీ ప్రస్థానంలో యాదవుల పార్టీగా ముద్ర వేసుకుంది. యాదవ, ముస్లిం వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, అధికారంలో మిగతా వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో యాదవేతర ఓబీసీలు సమాజ్‌వాదీ పార్టీకి దూరమయ్యారు. సంఖ్యాపరంగా యాదవులు, ముస్లింలు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నప్పటికీ, రాజ్యాధికారాన్ని సాధించేస్థాయిలో సీట్లు పొందాలంటే ఇతర వర్గాల మద్ధతు అనివార్యంగా మారింది. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్గాలు ప్రధాన ఓటుబ్యాంకుగా ఉన్న భారతీయ జనతా పార్టీకి సైతం, కేవలం ఈ వర్గాల ఓట్లతో అధికారం సాధించే పరిస్థితి లేదు.

దీంతో మోదీ-షా నేతృత్వంలోని బీజేపీ, గత విధానాలు, సాంప్రదాయాలకు భిన్నంగా సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసింది. ఇన్నాళ్లుగా సమాజ్‌వాదీకి మద్ధతిచ్చిన యాదవేతర ఓబీసీలను తమ దారిలోకి తెచ్చుకోగల్గింది. అలాగే బహుజన్ సమాజ్ పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత పొందే చమార్లను మినహాయించి మిగతా దళిత వర్గాలను కూడా కొంతవరకు ఆకట్టుకోగల్గింది. దీంతో పాటు యూపీలో కొన్ని కులాలకు ప్రత్యేక రాజకీయ పార్టీలున్నాయి. జాట్ ఓట్లపై ఆధారపడి పశ్చిమ యూపీలో ‘రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)’ రాజకీయం చేస్తుండగా, కుర్మీ వర్గానికి చెందిన ప్రజలకు ‘అప్నాదళ్’ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇదే తరహాలో నిషాద్ పార్టీ సహా యూపీలో 10కి పైగా రాజకీయ పార్టీలున్నాయి. అవన్నీ చాలావరకు ఓబీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించేవే. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అప్నాదళ్ చీలిక వర్గంలో ఒకటి, నిషాద్ పార్టీ బీజేపీతో పాటు కలిసి నడుస్తుండగా, డజనుకుపైగా పార్టీలు సమాజ్‌వాదీ కూటమిలో భాగమయ్యాయి.

దిద్దుబాటలో సమాజ్‌వాదీ
దూరమైన ఓబీసీలను మళ్లీ దరికి చేర్చుకుంటూ, ఓబీసీలకు పెద్దపీట వేస్తూ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. 159 మందితో విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో 31 మంది ముస్లింలు, 10 మంది బ్రాహ్మణులు, 31 మంది దళితులు, 18 మంది యాదవులు, 5గురు ఠాకూర్లు (క్షత్రియులు), 9 మంది వైశ్యులు, ఇద్దరు సిక్కులు, ఒక కాయస్త ఉండగా, అత్యధికంగా 52 సీట్లను యాదవేతర ఓబీసీ వర్గాలకు చోటు కల్పించింది. మొత్తంగా రాష్ట్రంలోని అన్నివర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ కీలక సందేశాన్ని పంపింది. గతంలో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న ఆ పార్టీ, మళ్లీ తిరిగి ఓబీసీల మద్ధతు కూడగట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోందని ఈ జాబితాను చూస్తే అర్థమవుతోంది.

- Advertisement -

లౌకికవాదం పేరుతో ఇన్నాళ్లూ మైనారిటీలు, ముస్లింల కోసం తన స్వరాన్ని బలంగా వినిపిస్తూ వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ, ఈ చర్య హిందూ ఓటుబ్యాంకును ప్రభావితం చేస్తుందని, తద్వారా బీజేపీ ప్రయోజనం పొందుతోందని గ్రహించింది. అందుకే ఈసారి ఎన్నికల్లో ముస్లింలకు తగిన సంఖ్యలో సీట్లను కేటాయించినా సరే, ముస్లింల ప్రస్తావన తీసుకురాకుండా జాగ్రత్తపడింది. అలాగే స్వామి ప్రసాద్ మౌర్య వంటి తూర్పు యూపీలో ప్రభావం కల్గిన ఓబీసీ నేతను చేర్చుకోవడం ద్వారా ఓబీసీలకు తామిచ్చే ప్రాధాన్యతను చాటుకుంటోంది. తూర్పు యూపీలో దాదాపు 8 శాతం ఓటుబ్యాంకు కల్గిన మౌర్య, కుష్వాహ, శాక్య, సైని వంటి ఉపకులాల్లో గట్టిపట్టున్న స్వామి ప్రసాద్ మౌర్య చేరిక సమాజ్‌వాదీ పార్టీపై ఉన్న యాదవులకు మాత్రమే చెందిన పార్టీ అనే ముద్రను చెరిపేయడానికి దోహదపడుతుంది.

అదే బాటలో మిత్రపక్షం
మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) కూడా సమాజ్‌వాదీ పార్టీ బాటలో సామాజిక సమతుల్యత కనిపించేలా టికెట్లను కేటాయించింది. పశ్చిమ యూపీలో తాము పోటీ చేస్తున్న 33 స్థానాల్లో 14 సీట్లు ఓబీసీలకు, 10 జాట్లకు, 2 గుర్జర్లకు, 5 ముస్లింలకు, 3 బ్రాహ్మణులకు, 2 ఠాకూర్లకు, సైనీలు, వైశ్యులకు చెరొక సీటు కేటాయించింది.

మండల్ – కమండల్ బాటలో కమలదళం
ఓబీసీల మద్ధతుతో వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ, ఆ మద్ధతును కాపాడుకునే ప్రయత్నంలో కమలదళం నిమగ్నమైంది. ఓబీసీ వర్గాల్లో పట్టున్న స్వామి ప్రసాద్ మౌర్య, ధారాసింగ్ చౌహాన్, ధరం సింగ్ సైనీ వంటి కేబినెట్ మంత్రులు చివరి నిమిషంలో గోడ దూకి సమాజ్‌వాదీలో చేరడం బీజేపీకి శరాఘాతమే అయినప్పటికీ, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు 403 స్థానాల్లో 196 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి బీజేపీ, అందులో 76 మంది ఓబీసీలకు చోటు కల్పించింది. మిగతావారిలో 34 మంది ఠాకూర్లు, 24 మంది బ్రాహ్మణులు, 38 మంది దళితులు, 13 మంది వైశ్యులు, 6గురు పంజాబీలు, ముగ్గురు త్యాగిలు, ఇద్దరు కాయస్త వర్గానికి చెందినవారున్నారు.

సీట్ల కేటాయింపులో తమ సాంప్రదాయ ఓటు బ్యాంకు బ్రాహ్మణ్, బనియా (వైశ్య), క్షత్రియ వంటి అగ్రవర్ణాలతో పాటు ఓబీసీలకు కూడా తగిన ప్రాధాన్యత కల్పిస్తూ మండల్ (ఓబీసీలు) – కమండల్ (కాషాయదళం – హిందూ ఓటుబ్యాంక్) విధానాన్ని అనుసరిస్తోంది. ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే సమాజ్‌వాదీ పార్టీకి వ్యతిరేకంగా, హిందూ ఓటు బ్యాంకును సమీకృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు దాదాపు 20 శాతం ఉన్నప్పటికీ, బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement