Sunday, April 28, 2024

ఐటీ శాఖతో బెదిరింపులా : బీజేపీపై ఎస్పీ నేత అఖిలేష్‌ ధ్వజం

లక్నో : యూపీలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేతల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఐటీ శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకోవడంలో కాంగ్రెస్‌ బాటలోనే బీజేపీ ప్రభుత్వం వెళ్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు. అఖిలేష్‌ యాదవ్‌కు సన్నిహితంగా ఉన్న వారితో పాటు పార్టీ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ఏజెన్సీలు తనిఖీలు చేపట్టాయి. ఎస్పీ నేతలు రాజీవ్‌ రాయ్‌, మనోజ్‌ యాదవ్‌, అఖిలేష్‌ వ్యక్తిగత కార్యదర్శి జైనేంద్ర యాదవ్‌తో పాటు పలువురి ఇళ్లలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ పార్టీ నేతలు, అఖిలేష్‌ యాదవ్‌ సన్నిహితుల ఇళ్లలో జరిగిన ఐటీ దాడులపై అఖిలేష్‌ యాదవ్‌ తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. బీజేపీయే ఈ ఐటీ దాడులు చేయించిందని విమర్శించారు. ఎవరిని అయినా బెదిరించడానికి, తమ పార్టీలో చేర్పించడానికి, లొంగదీసుకోవడానికి గతంలో కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఏజెన్సీ బృందాలతో ఇలా దాడి చేయించేదని ఆరోపించారు.

ఎన్నికల హామీలు ఎక్కడ..?
ఇప్పుడు ఐటీ దాడులు జరుగుతున్నాయని.. ఎన్నికలు సమీపిస్తున్నందున ముందు ముందు సీబీఐ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు. ఇలాంటి దాడులతో సైకిల్‌ ముందుకు నడపకుండా అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అఖిలేష్‌ జోస్యం చెప్పారు. మరోసారి రాష్ట్ర ప్రజలను మోసగించలేరని అన్నారు. బీజేపీ గత ఎన్నికల సందర్భంగా యూపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని, ప్రస్తుతం ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు సమాజ్‌వాదీ నేతలు, మద్దతుదారులపై సెంట్రల్‌ ఏజెన్సీలను ప్రయోగిస్తుంద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకోలేకపోయిందని గుర్తు చేశారు. లౌకికత్వంతోనే రామరాజ్యం సాధ్యమని, రామరాజ్యం రావాలంటే.. లౌకికత్వం కావాలని ఆయన వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement