Thursday, April 25, 2024

Big Story: పైసా ఖ‌ర్చు లేకుండా ఆమ్‌దాని తెచ్చే మార్గం.. ఇట్లా చేస్తే వెయ్యి కోట్లు వ‌స్త‌య్‌!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రానికి భారీగా ఆమ్‌దానీ సమకూర్చే మార్గాలను ఇన్​కమ్​ ట్యాక్స్​ డిపార్ట్​మెంట్​ అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే శాఖను పునర్‌వ్యవస్థీకరించి బలోపేతం చేయడంతోపాటు, మొండి బకాయిలకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద సెటిల్​ చేయడానికి కావాల్సిన మార్గాలను ఈజీ చేసి మరింత ఆదాయాన్ని పెంచుకుంది. అట్లనే వెయ్యి కోట్ల ఆమ్​దాని సమకూర్చే ఓ సరికొత్త ఉపాయాన్ని అధికారులు ప్రభుత్వం ముందు ఉంచారు. ఇది కానీ ఇంప్లిమెంట్​ చేస్తే ఇక తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో కాసులు గల గలలాడడం ఖాయం అంటున్నారు ఆర్థికవేత్తలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర రాబడి ఆరు నెలల కాలంలో రూ.లక్ష కోట్లకు చేరింది. అయితే అప్పులపై ఆంక్షలతో కొంత ప్రతిష్టంభన ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలో అన్ని రాబడి శాఖలను బలోపేతం చేయడంతోపాటు, అదనపు వనరుల సమీకరణ దిశగా ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి శాఖ లక్ష్యం చేరడంతోపాటు, వృధా, లీకేజీలను అరికట్టాలని సీఎం కేసీఆర్‌ రాబడి శాఖలకు మార్గనిర్దేశం చేశారు. దీంతో అన్ని సొంత వనరుల రాబడి శాఖల్లో కదలిక వచ్చింది. అదనపు మార్గాలపై ముందస్తు కార్యాచరణ ముమ్మరమైంది.

సర్కార్‌ ఆదేశాలకు అనుగుణంగా వాణిజ్య పన్నుల శాఖ కీలక మార్గాలను పరిశీలించింది. తన అధ్యయనంలో అనేక విషయాలను, లీకేజీలను గుర్తించింది. ఈ దిశలో తాజాగా ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి రిటర్న్‌లు వేయని వ్యాపార వాణిజ్య సంస్థలకు చెందిన రూ.1000 కోట్లకు పైగా మొత్తం రాబడి తెచ్చిపెట్టే సరికొత్త ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. వ్యాపారస్తుల్లో అవగాహన కల్పించి పన్ను రిటర్న్‌లను ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాఖలు చేయించేలా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సెలవులు రద్దు చేయడంతో పాటు ఆదివారం కూడా పని చెయ్యాల్సిందేనని స్పష్టం చేసింది.

పన్నుల వసూళ్లలో రికార్డులు
కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో 2017 జులైలో వస్తుసేవల పన్ను జీఎస్‌టీని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం రికార్డులను సృష్టించింది. ఐదు రకాల శ్లాబుల్లో తెచ్చిన ఈ పన్నులో వసూలైన ప్రతి రూపాయిలో సగం కేంద్రానికి, సగం వినియోగం జరిగే రాష్ట్రాలకు తిరిగి వస్తుంది. మన రాష్ట్రానికి చెందిన వ్యాపార వాణిజ్య సంస్థలు ఇతర రాష్ట్రాలలో కొనుగోలు చేసే సరుకులు, సేవలకు చెందిన చెల్లింపుల జీఎస్‌టీని ఆయా సంస్థలు తిరిగి తీసుకునే వెసులుబాటు ఉంది. లేదంటే ఆ మొత్తాన్ని తన ఖాతాల్లో నిల్వ ఉంచుకుని ఇతర వ్యాపార లావాదేవీలకు వాడుకోవచ్చు.

కానీ కొన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు తన నెలవారీ రిటర్న్‌లలో కొనుగోళ్ల వివరాలు చూపించడం లేదు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా రాకుండా కేంద్రం వద్దనే ఉండిపోతోంది. కేంద్ర ఆర్ధిక శాఖ రెవెన్యూ నివేదికలను అధ్యయనం చేసిన రాష్ట్ర ఎకనామిక్‌ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌.. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్‌టీ వాటా తగ్గిందని గుర్తించింది. ఆయా అవకతవకలపై అధికారులు మరింత సమగ్ర విశ్లేషణ చేయగా.. వేలాది మంది ఇతర రాష్ట్రాల్లో సరుకులు కొనుగోళ్లు, సేవలు వినియోగం చేస్తున్నప్పటికీ.. వాటికి చెందిన వివరాలను, టర్నోవర్‌లను నెలవారీ, వార్షిక రిటర్న్‌లలో చూపడం లేదని తేలింది. దీంతో వ్యాపారులు చెల్లించిన జీఎస్‌టీ తిరిగి తీసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. మరోవైపు రాష్ట్ర ఖజానాకు జమ కావాల్సిన మొత్తం కూడా జమకాకుండా నష్టంగా పరిణమించింది. దీంతో ఇలాంటి వ్యాపార వాణిజ్య సంస్థలు ఎన్ని ఉన్నాయని ఆరా తీసిన ఆర్ధిక నిఘా విభాగం తుది నిఘా అనంతరం ఇవన్నీ 36 వేలకుపైగా సంస్థలు ఉన్నట్లు గుర్తించింది.

- Advertisement -

సర్దుబాట్లు…
వ్యాపారులు దేశంలో ఎక్కడ సరుకులు, సేవలను కొనుగోలు చేసినా తమ రిటర్న్‌లలో చూపించినట్లయితే ఐజీఎస్‌టీ కింద జమ అయ్యే మొత్తం జీఎస్‌టీ మెకానిజం ద్వారా ఆయా రాష్ట్రాలకు ప్రతి నెల సర్దుబాటు అవుతుంది. నిబంధనల ప్రకారం అది సక్రమంగా జరగని కారణంగా ఆయా రాష్ట్రాలకు ఐజీఎస్‌టీ సర్దుబాటు కాకుండా ఆగిపోయింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి చెందిన వార్షిక రిటర్న్‌లు వేయడానికి తక్కువ సమయం ఉండడం, గడువు సమీపిస్తున్న తరుణంలో ఆయా వ్యాపార సంస్థల ప్రతినిధుల్లో అవగాహనా కల్పించి రిటర్న్‌లు వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి వాళ్లు 36వేలకు పైగా ఉండడంతో వారందరిని సంప్రదించి అవగాహన కల్పించేందుకు వాణిజ్య పన్నుల శాఖకు చెందిన రాష్ట్రంలోని 2500 మందిని భాగస్వామ్యం చేసింది. జాయింట్‌ కమిషనర్‌ నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరికి పని విభజన చేశారు. వారందరినీ ఫోన్‌ ద్వారా సంప్రదించి అవగాహన కల్పించి వాళ్ల కొనుగోళ్లకు సంబంధించి తక్షణమే రిటర్న్‌లు వేయించనున్నారు.

అత్యవసర సేవగా పరిగణించి సెలవులు రద్దు..
ఈ పనులను అత్యవసరం కింద పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం అందరు అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. ఉద్యోగులు ఆదివారం కూడా పని చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం పూర్తి చేయడం ద్వారా రూ.1000 కోట్లకు పైగా రాష్ట్రానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలంతా పనిచేసి లక్ష్యం చేరేలా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు శ్రమిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement