Monday, April 29, 2024

హైదరాబాద్ లో ట్రిపుల్ తలాక్ కేసులు..

దేశంలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ ముద్ర పడినా ముస్లిం మహిళలకు మాత్రం న్యాయం జరగడం లేదు. ముస్లిం మహిళ (వివాహ హక్కుల సంరక్షణ) బిల్లు 2019 నిబంధనల ప్రకారం ముస్లిం మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం. అలా చెబితే మూడేళ్ల జైలు శిక్ష, దానితోపాటు జరిమానా కూడా ఉండచ్చు. కానీ కొందరు ముస్లిం పురుషులు మాత్రం మారడం లేదు.

ట్రిపుల్ తలాక్ ను నిషేధించినా హైదరాబాద్ నగరంలోని పోలీసు స్టేషన్లలో ట్రిపుల్ తలాక్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం 2019లోనే ఆమోదం పొందినప్పటికీ 50 మంది ముస్లిమ్ మహిళలు తమ భర్తలు తమకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చారంటూ పోలీసులను ఆశ్రయించారు. కేవలం హైదరాబాద్ లోనే 50 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదు అయ్యాయి.

హైదరాబాద్ పోలీసు కమిషనర్ పరిధిలోనే 40, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 10 కేసులు నమోదైయ్యాయి. ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చినా ఇంకా కొందరు ముస్లిమ్ భర్తలు ట్రిపుల్ తలాఖ్ లు ఇస్తూనే ఉన్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన ఓ ముస్లిమ్ మహిళ సోమాలియా దేశానికి చెందిన అబ్దీవాలి అహ్మద్ ను 2015లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన కొన్ని నెలలకే భర్త అబ్దీ వాలీ భార్యను హైదరాబాద్ లోనే వదిలి అమెరికా వెళ్లి పోయాడు. అనంతరం అమెరికా నుంచి ఫోన్ చేసిన భర్త ట్రిపుల్ తలాక్ అంటూ చెప్పాడు. అనంతరం విడాకుల పత్రాన్ని సైతం వాట్సాప్ లో పంపించాడు. దీంతో బాధిత భార్య పోలీసు కేసు పెట్టారు. ఎల్బీనగర్ లో జరిగిన మరో కేసులో భార్య గృహహింస కేసు పెట్టిందని భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

మూడుసార్లు తలాక్‌ అని ఎస్‌ఎంఎస్, వాట్సాప్, రాతపూర్వకంగా, నోటి మాటతో లేదా ఇతర ఏ మార్గం, పద్ధతిలో చెప్పినా ఆ చర్య నేరమని బిల్లు చెబుతోంది. తక్షణం మూడుసార్లు తలాక్‌ చెప్పి భార్యలకు విడాకులిచ్చే ముస్లిం పురుషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలున్నాయి. ఎవరైనా ముస్లిం పురుషుడు తలాక్‌ పద్ధతిలో భార్యకు విడాకులిచ్చాడని ఫిర్యాదు వస్తే, వారంట్‌ లేకుండానే అతణ్ని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఈ బిల్లు కల్పిస్తోంది. అయితే బాధిత మహిళ లేదా ఆమె రక్త సంబంధీకులు లేదా అత్తింటివారు ఫిర్యాదు చేస్తే మాత్రమే పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధిత మహిళ వాంగ్మూలాన్ని కూడా పరిశీలించిన తర్వాతనే జడ్జీలు అవసరం అనుకుంటే నిందితుడికి బెయిలు మంజూరు చేయవచ్చు. విడాకుల అనంతరం తాను, తన పిల్లలు బతకడానికి అవసరమైన భరణం ఇవ్వాలని భర్తను అడిగేందుకు మహిళలకు హక్కు ఉంటుంది.

- Advertisement -

ఇది కూడా చదవండి: దళితబంధుకు నా భార్య ఆశీర్వాదం.. అవి ఆగవు: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement