Wednesday, May 1, 2024

Breaking: కరీంనగర్ కారు ప్రమాదం కేసులో ట్విస్.. కారు నడిపింది మైనర్లే!

కరీంనగర్ జిల్లాలో సంచలనం కలిగించిన కమాన్ కారు ప్రమాదంలో సంచలన అంశాలు బయట పడుతున్నాయి. కారు నడిపింది మైనర్ బాలుడని తేలింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లతో పాటు మైనర్కు కారు ఇచ్చిన తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కరీంనగర్ సిపి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు మరణించిన విషయం విదితమే. ఈ ప్రమాద సమయంలో కారులో మరో ఇద్దరు మైనర్లు వున్నారని తెలుస్తోంది. ప్రమాదం జరిగే ఐదు నిమిషాల ముందు కమాన్ చౌరస్తాలోని పెట్రోల్ బంక్ లో ఇంధనం నింపుకుని రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

మైనర్లకు డ్రైవింగ్ రాకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు. కారు 100 స్పీడ్ తో జనంపైకి దూసుకెళ్లినట్లు భావిస్తున్నారు. కారు యజమాని రాజేంద్రప్రసాద్ ని పోలీసుల అదుపులో తీసుకున్నారు. అతని కొడుకు మరో ఇద్దరు మైనర్లు పరారీలో వున్నారని తెలుస్తోంది. నిన్న రాత్రి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు సమాచారం.

కాగా, ఆదివారం తెల్లవారుజామున కరీంనగర్‌ పట్టణంలోని కమాన్ చౌరస్తాలో వద్ద కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కారు బీభత్సంతో ఒకరు ఘటనాస్థలిలోనే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఫరియాద్‌, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కారును వదిలేసి నలుగురు యువకులు పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు. కారుపై 9 ఓవర్‌స్పీడ్ చలాన్లు ఉన్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement