Tuesday, April 30, 2024

TS | హమ్మయ్య, ప్రాణాలతో బయటపడ్డాం.. మణిపూర్​ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల ఆవేదన

అస్సలు తాము ప్రాణాలతో బయటపడతామన్న నమ్మకం లేకుండాపోయిందని, ఎలాగోలా బతికితే చాలనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. మణిపూర్​లో హింసాత్మక ఘటనల మధ్య తెలంగాణ, ఏపీకి చెందిన వందలాది మంది విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. దీంతో సీఎం కేసీఆర్​ చొరవ తీసుకుని ప్రత్యేక​ విమానాల ద్వారా విద్యార్థులను సేఫ్​గా తీసుకొచ్చారు. హైదరాబాద్​కు చేరుకున్న వందలాది మంది విద్యార్థులు సీఎం కేసీఆర్​కు సర్వదా రుణపడి ఉన్నామని, మనస్ఫూర్తిగా థ్యాంక్స్​ చెబుతున్నామన్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హింసాత్మక ఘటనలతో మణిపూర్‌ రగిలిపోతోంది. అక్కడ చదువుకునేందు వెళ్లి చిక్కుకుపోయారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు. అయితే.. వారిని తెలంగాణ సీఎం కేసీఆర్​ స్వరాష్ట్రానికి రప్పించేందుకు తీసుకున్న చర్యలు ఫలించాయి. సోమవారం ప్రత్యేక విమానంలో వారంతా హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం 214 మంది విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఇవ్వాల మధ్యాహ్నం 1.22 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.

ఇందులో 106 మంది తెలంగాణకు చెందినవారు విద్యార్థులు కాగా, మిగిలిన 108 మంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఇతర అధికారులు విమానాశ్రయంలో విద్యార్థులకు స్వాగతం పలికారు. వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలుగా ఆహారం, రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. క్షేమంగా తిరిగి రావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

విద్యా సంస్థల చుట్టూ జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా తాము ఎంతో భయానికి గురయ్యామని, తమ భద్రత గురించి ఆందోళన చెందినట్టు వారు చెప్పారు. అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తమ కాలేజీ చుట్టుపక్కల ఇళ్లలో పేలుళ్లు జరగడంతో ఎంతో భయపడ్డాం  అని ఓ విద్యార్థి తెలిపాడు. కళాశాల అధికారులు నిస్సహాయంగా ఉన్నారని, స్థానిక సిబ్బంది తమను పట్టించుకోలేదని మరో విద్యార్థి చెప్పాడు. తమను సొంత రాష్ట్రానికి సురక్షితంగా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

మణిపూర్‌లోని ఎన్‌ఐటీ నుంచి మొత్తం 26 మంది విద్యార్థినులు హైదరాబాద్‌కు చేరుకున్నారని మరో విద్యార్థి స్ఫూర్తి తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తమతో ఫోన్‌లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. మణిపూర్‌లో తెలంగాణకు చెందిన 180 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని మంత్రి మల్లా రెడ్డి చెప్పారు. మిగిలిన విద్యార్థులు కూడా కోల్‌కతా చేరుకున్నారు. సోమవారం రాత్రికి హైదరాబాద్‌ రానున్నట్టు మల్లారెడ్డి వెల్లడించారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మణిపూర్‌లోని పోలీసు ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్‌ జనరల్‌ అధికారులను సంప్రదించారు. విద్యార్థులను వెనక్కి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారి ప్రయాణ ఖర్చులను భరించింది.  సోమవారం నాటికి మరో ప్రత్యేక విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ కానుంది. విద్యార్థులు రాయ్‌పూర్, పాట్నా, భువనేశ్వర్ నుండి వివిధ విమానాల ద్వారా కూడా ఇక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, ప్రొటోకాల్‌ విభాగం కార్యదర్శి అరవింద్‌ సింగ్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌, ఇతర అధికారులు విద్యార్థులను పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement