Saturday, May 4, 2024

2023 నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి

అవినీతికి తావు లేకుండా లక్ష్యాన్ని చేరుకునేలా సమగ్ర భూ సర్వే సాగాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపడుతున్నామని చెప్పారు. జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని, లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధంగా సర్వే సాగాలని స్పష్టం చేశారు. శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. సర్వే కోసం అవసరమైన సాఫ్ట్ వేర్, పరికరాలు, వనరులను వెంటనే సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. సర్వే చేసే సిబ్బందికి మెరుగైన శిక్షణను ఇవ్వాలని ఆదేశించారు. నాలుగు వారాలకోసారి భూ సర్వేపై సమీక్ష చేస్తానని, ‘స్పందన’లో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లోనూ దీనిపై చర్చిస్తానని చెప్పారు. మంత్రుల కమిటీ కూడా వారానికోసారి సర్వే పురోగతిపై సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకుని ప్రతిష్ఠాత్మకంగా సర్వేని నిర్వహించాలని  జగన్ ఆదేశించారు. 

సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహితం రికార్డులు అప్‌ డేట్‌ కావాలన్నారు. భూమి కార్డులను రైతులకు ఇవ్వాలన్న సీఎం… అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. సర్వే త్వరితగతిన పూర్తిచేయడానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవాలని, డ్రోన్లు సహా ఇతర టెక్నికల్‌ మెటీరియల్‌ను అవసరమైన మేర కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement