Thursday, May 2, 2024

వెద‌రుతో బాహుబ‌లి బారియ‌ర్..

ముంబై: ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా జాతీయ రహదారి పక్కన వెదురు బారియర్‌ను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ -యావత్మాల్‌ జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై 200 మీటర్ల పొడవున ఈ ఏర్పాటు జరిగింది. ఈవిషయాన్ని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. దీనిని ప్రపంచంలోనే మొదటి ప్రయోగంగా అభివర్ణించారు. దేశంతోపాటు స్థానిక వెదురు రంగానికి ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. పర్యావరణహిత వెదురు బారియర్లు, స్టీల్‌ బారియర్స్‌కి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని చెప్పారు. ఈ మేరకు శనివారం, హైవేపై ఉన్న బారియర్‌ చిత్రాన్ని ట్వీట్‌ చేశారు. ఇలాంటి ప్రయత్నాలు పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తాయని చెప్పారు. ‘వణి-వరోరా హైవేపై 200 మీటర్ల పొడవైన వెదురు క్రాష్‌ బారియర్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే మొదటిది. ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా ఇదొక అసాధారణ విజయం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వెదురు బారియర్‌కు బాహుబలి అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.

నేషనల్‌ ఆటోమోటివ్‌ టెస్టు ట్రాక్స్‌, సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ వంటి ప్రభుత్వ సంస్థల్లో అనేక కఠిన పరీక్షలు నిర్వహించిన అనంతరం దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ గుర్తింపు కూడా పొందినట్లు తెలిపారు. బాంబూసా బాల్కోవా అనే వెదురు జాతితో వీటిని తయారు చేసినట్లు వెల్లడించారు. ఈ వెదురు బారియర్లలో 50-70శాతం పునర్వినియోగం ఉంటుందని, అదేగనుక ఉక్కు బారియర్ల విషయంలో ఇది కేవలం 30-50 శాతం మాత్రమేనని అన్నారు. ఇది గ్రామీణ – వ్యవసాయ స్నేహపూర్వక పరిశ్రమ. ఇది మరింత ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది అని గడ్కరీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement