Friday, April 26, 2024

కర్ణాటకకు ఆక్సిజన్‌ సరఫరా అంశంపై కేంద్రానికి సుప్రీంలో చుక్కెదురు..

కర్నాటకకు ఆక్సిజన్‌ సరఫరా విషయంలో కేంద్రానికి ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటకకు రోజువారీ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కేటాయింపును పెంచాలన్న హైకోర్టు ఉత్తర్వుల నిలుపుదలకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం  దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. హైకోర్టు అత్యంత జాగ్రత్తగా ఇచ్చిన ఆదేశాలను ఇచ్చిందని, వీటిని తీరస్కరించి కర్ణాటక ప్రజలను  ఇబ్బందుల్లోకి నెట్టలేమని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తగిన కారణం ఏదీ తమకు కనిపించడం లేదని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం  తేల్చి చెప్పింది.

తమ రాష్ట్రానికి రోజువారీ ఆక్సిజన్ సరఫరాను 1,200 మెట్రిక్ టన్నులకు పెంచాలని  కర్ణాటక హైకోర్టు మే 5న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే  965 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కర్ణాటకకు సరఫరా చేస్తున్నామని, దీన్ని పెంచలేమని ఈ ఆదేశాలను నిలిపేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంను ఆశ్రయించింది. ఈ సమస్యపై మద్రాస్, తెలంగాణా, ఇతర హైకోర్టులు కూడా విచారణ జరుపుతున్నాయన్నారు అయితే హైకోర్టు బాగా ఆలోచించి, జాగ్రత్తగా చక్కని ఆదేశాలు  జారీ చేసిందని సుప్రీంకోర్టు కేంద్రం వాదనలను తోసిపుచ్చింది. మరోవైపు  కర్ణాటక కేసును చేపట్టే ముందు, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement