Friday, April 26, 2024

కెప్టెన్ గా రోహిత్..విరాట్ పై వేటు..?

భారత క్రికెట్ జట్టులో మరో సంచలనం నమోదు కాబోతుంది. టీమిండియా క్రికెట్ జ‌ట్టుకు త్రీ ఫార్మాట్స్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కొహ్లీ త్వ‌ర‌లోనే ఈ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోనున్నాడ‌ని వార్తలు వస్తున్నాయి. ప్ర‌త్యేకించి వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి కొహ్లీ త‌ప్పుకోనున్న‌ట్టుగా స‌మాచారం. ఈ విష‌యంలో బీసీసీఐ తో చ‌ర్చ‌లు జ‌రిపిన ఈ లెజెండ‌రీ ప్లేయ‌ర్ త్వ‌ర‌లోనే స్వ‌యంగా ఇందుకు సంబంధించి ప్ర‌క‌ట‌న‌ను చేయ‌నున్నాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోనున్నాడు. ఈ మేరకు ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సమాచారమిచ్చిన విరాట్ కోహ్లీ.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చేతికి పగ్గాలు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి.

2014లో మహేంద్రసింగ్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీని అందుకున్న విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత 2017లో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కానీ.. అతని కెప్టెన్సీలో ఇప్పటి వరకూ కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ని కూడా భారత్ జట్టు గెలవలేదు. దాంతో.. గత రెండేళ్ల నుంచి కెప్టెన్సీ విభజనపై చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు బ్యాట్స్‌మెన్‌గా కూడా కోహ్లీ గత ఏడాదన్నరగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో.. తాను బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ చేసేందుకు వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక టెస్టు టీమ్ కెప్టెన్‌గా మాత్రమే కోహ్లీ ఉండనున్నాడు.

టీ20 ప్రపంచకప్‌ టైటిల్ అందించకపోతే విరాట్ కోహ్లీనే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటాడని విశ్లేషకులు అంటున్నారు. గత కొంత కాలంగా కోహ్లీ కూడా వ్యక్తిగతంగా రాణించడం లేదు. ఈ క్రమంలో తన బ్యాటింగ్‌పై దృష్టిసారించేందుకు.. ఎక్కువ కాలం ఆడేందుకు తానే సారథ్య బాధ్యతలు వదిలేస్తాడంటున్నారు. ఏదీ ఏమైనా టీ20 ప్రపంచకప్ ఫలితంపైనే భారత క్రికెట్‌ భవిష్యత్తు ఆధారపడి ఉందనేది వాస్తవం. ఇక టోర్నీ కోసం భారత సెలక్షన్‌ కమిటీ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సుదీర్ఘంగా ఆలోచించి పకడ్బందీ టీమ్‌ను ఎంపిక చేసింది. ఆశ్చర్యకరంగా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు కల్పించింది. ఇక మెగా టోర్నీ అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్‌లో జరుగుతుంది. అక్టోబరు 24న పాకిస్థాన్‌తో పోరుతో టీమ్‌ ఇండియా టైటిల్‌ వేట ఆరంభమవుతుంది.

ఇది కూడా చదవండి: ధోని ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లకే మొగ్గు చూపేవాడు: అజయ్‌ జడేజా

Advertisement

తాజా వార్తలు

Advertisement