Friday, June 14, 2024

IPL : పొంచి ఉన్న వ‌రుణుడు… క్వాలిఫ‌యిర్ 2 మ్యాచ్ పై నీలినీడ‌లు

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో మెగా ఫైనల్ కు ముందు ఇక ఒకే మ్యాచ్ మిగిలి ఉంది. క్వాలిఫయర్ 2లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తలపడనుంది. అయితే మ్యాచ్ రోజున వర్షం కురిసే అవకాశం ఉండటం ఇరు జట్ల అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. వచ్చే 48 గంటలపాటు చెన్నైలో తేలికపాటి వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

- Advertisement -

కానీ కొన్ని గంటలపాటు వర్షం ఏకధాటిగా కురిస్తేనే మ్యాచ్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అలా జరిగినా ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. అంటే శుక్రవారం ఒకవేళ భారీ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే శనివారం తిరిగి నిర్వహించనున్నారు. ఒకవేళ అనూహ్యంగా శనివారం కూడా భారీ వర్షం కురిసి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో ముందున్న జట్టు ఫైనల్ కు అర్హత సాధించనుంది. ఈ లెక్కన సన్ రైజర్స్ సులువుగా ఫైనల్ చేరుతుంది. లీగ్ స్టేజ్ లో ఇరు జట్లకు 17 పాయింట్ల చొప్పున లభించినప్పటికీ రాజస్థాన్ తో పోలిస్తే మెరుగైన రన్ రేట్ వల్ల సన్ రైజర్స్ రెండో స్థానంలో నిలవడమే ఇందుకు కారణం.

మరోవైపు రాజస్తాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ సహా కొందరు ఆటగాళ్లు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతుండటం ఆ జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ గెలిచిన అనంతరం శాంసన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను 100 శాతం ఫిట్ గా లేనని.. దగ్గుతో బాధపడుతున్నానని పేర్కొన్నాడు. మరికొందరు ఆటగాళ్లు సైతం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు. అయితే క్వాలిఫయర్ 2కు ముందు తమకు ఒక రోజు విశ్రాంతి లభిస్తున్నందున తామంతా కోలుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఇక తొలి క్వాలిఫ‌యిర్ లో ఓడిన స‌న్ ఈసారి సత్తా చాటాల‌ని భావిస్తున్న‌ది.. గ‌త మ్యాచ్ గుణ‌ఫాఠాల‌తో బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో మార్పుల‌కు సిద్ద‌మ‌వుతున్న‌ది..ఫైన‌ల్స్ కి అడుగుపెడ‌తామ‌నే ధీమాతో ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement