Sunday, June 2, 2024

RCB : ఆ ఏడు త‌ప్పులే… ఆర్సీబిని ఇంటికి పంపాయి…

ఐపీఎల్ 2024 లీగ్ దశలో ఆర్సీబీ ప్రస్థానం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అట్టడుగున పాతాళానికి పడిపోయి, ఎవరూ ఊహించని విధంగా ఝమ్మని పైకి లేచింది. ప్లే ఆఫ్ వరకు వెళ్లిపోయింది. ఆడాల్సిన నాకౌట్ మ్యాచ్ లో ఒక్కసారి చప్పగా చల్లారిపోయింది. అయితే పోరాడి ఓడిందనడం కంటే చేజేతులారా ఓటమిని కొని తెచ్చుకుందనే చెప్పాలి. మ్యాచ్ లో ఎన్నో వ్యూహాత్మక తప్పిదాలు అలా జరిగిపోయాయి.

- Advertisement -
  1. ముఖ్యంగా టాస్ గెలిచి కూడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం తెలివైన నిర్ణయం కాదని అంటున్నారు.
  2. మొదటి 10 ఓవర్లు ఫీల్డింగు అత్యంత దారుణంగా ఉంది. ఎన్నో విలువైన పరుగులు వృథాగా వెళ్లిపోయాయి. తర్వాత పుంజుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అదే రాజస్థాన్ మొదటి నుంచి కూడా ఫీల్డింగ్ కట్టుదిట్టంగా చేసి బ్యాటర్లను ఊపిరి తీసుకోనివ్వలేదు. దాంతో వాళ్లు రన్ రేట్ కోసం విధిలేక రాంగ్ షాట్లు కొట్టి అవుట్ అయిపోయారు.
  3. సెకండ్ బ్యాటింగులో పిచ్ స్పిన్ కు తిరుగుతుందని అనుకుంటే పేసర్లతోనే బౌలింగ్ అంతా వేయించారు. స్పిన్నర్లు స్వప్నిల్, కర్ణ్ శర్మ ఇద్దరు కూడా 2 ఓవర్లలో 19 పరుగులు చొప్పున ఇచ్చారు. చెరొక ఓవరు మరొకటి ఇస్తే, పేసర్ల మీద ఒత్తిడి తగ్గేదని అంటున్నారు.
  4. మ్యాక్స్ వెల్ నిజంగానే 2024 సీజన్ లో జట్టుకి అదనపు భారంగా మారాడు. అతన్ని పక్కన పెట్టలేని బలహీనతే కొంప ముంచింది. నాకౌట్ మ్యాచ్ లో కూడా అదే నిర్లక్ష్యపు షాట్ కొట్టి డక్ అవుట్ అయ్యాడు. బౌలింగులో తనకి ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. .
  5. యశస్వి ఇచ్చిన సింపుల్ క్యాచ్ ను మ్యాక్స్ వెల్ నేలపాలు చేశాడు. అప్పుడు యశస్వి 3 పరుగుల మీదే ఉన్నాడు. తర్వాత బతికిపోయి కొరకరాని కొయ్యలా మారి.. 30 బంతుల్లో 45 కీలకమైన పరుగులు చేశాడు. తనవే మ్యాచ్ లో హయ్యస్ట్ స్కోరు అంటే అవెంత విలువైన పరుగులో అర్థం చేసుకోవాలి. మ్యాక్స్ వెల్ చేసిన పొరపాటు జట్టుకి గ్రహపాటులా మారింది.
  6. రాజస్థాన్ కూడా అంత గొప్పగా ఆడలేదు. కాకపోతే తక్కువ స్కోరు కావడంతో ఆచితూచి ఆడి మ్యాచ్ ని గట్టెక్కించారు. అంతేకాకుండా వారు గత 4 మ్యాచ్ లు ఓడిపోతూ వస్తున్నారు. ఆత్మనూన్యతా భావంతో ఉన్నారు. వారిని ఓడించడం ఆర్సీబీకి చాలా తేలికైన పని. కానీ ప్రతీ సందర్భంలో రాజస్థాన్ పుంజుకునేందుకు ఆర్సీబీ అకాశాలు ఇస్తూ వెళ్లారు.

7.విరాట్ కొహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ ఇద్దరూ సీనియర్లు.. ఇద్దరూ ఓపెనర్లుగా రావడమే పెద్ద మైనస్ గా మారి, జట్టుపై ప్రభావం చూపిస్తోంది. వారిద్దరూ త్వరగా అవుట్ అయితే, ముందుండి నడిపించేవాళ్లు కనిపించడం లేదు. అయితే ఇంతవరకు గెలిచినవి కూడా వారిద్దరూ ఆడితేనే గెలిచాయి అనే సంగతి మరువకూడదు. వీళ్లిద్దరూ అవుట్ అయ్యాక, జట్టుని గెలిపించినవాడు ఒక్కడు కనిపించలేదు.
కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు, ఆర్సీబీ ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. అయితే ప్లే ఆఫ్ వరకు రావడమే గొప్ప కాబట్టి, ఇంతటితో సంతృప్తి పడితే అంతే మంచిదని అభిమానులు అనుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement