Sunday, May 19, 2024

మృత్యువుతో పోరాడుతున్న.. జింబాబ్వే క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్

మృత్యువుతో పోరాడుతున్నాడు జింబాబ్వే క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్..ఆల్ రౌండ‌ర్ హీత్ స్ట్రీక్.. స్టేజ్‌-4 క్యాన్సర్‌తో బాధపడుతూ దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని జింబాబ్వే క్రీడా మంత్రి డేవిడ్‌ కౌల్టర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. హీత్‌ స్ట్రీక్‌ కోలుకోవాలని ప్రార్థించాలని ఆ దేశ క్రికెట్‌ సంఘం పిలుపునిచ్చింది. జింబాబ్వే గొప్ప క్రికెటర్లలో ఒకరైన హీత్‌ స్ట్రీక్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతని కోసం ప్రార్థించాలని డేవిడ్‌ కౌల్టర్ట్‌ కోరారు. అయితే, హీత్‌ స్ట్రీక్‌ పెద్దపేగు, కాలేయ క్యాన్సర్‌ స్టేజ్‌-4 దశలో ఉన్నది. క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుండగా.. దక్షిణాఫ్రికాలోని ప్రముఖ అంకాలజిస్ట్‌ వద్ద చికిత్స పొందుతున్నారు. హీత్‌స్ట్రీక్‌ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై గోప్యత పాటించాలని మాజీ క్రికెటర్‌ కుటుంబం కోరింది. హీత్ స్ట్రీక్ నవంబర్ 1993లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన వన్డేలో ఎంట్రీ ఇచ్చాడు.

డిసెంబర్ 1993లో పాకిస్థాన్‌పై తన టెస్టు అరంగేట్రం చేశాడు. చివరిసారిగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ను ఆగస్ట్‌ 2002లో న్యూజిలాండ్‌తో ఆడగా.. చివరి టెస్టును సెప్టెంబర్‌ 2005లో భారత్‌తో ఆడాడు. హీత్ తన కెరీర్‌లో సచిన్ టెండూల్కర్‌ను మూడుసార్లు, సౌరవ్ గంగూలీని నాలుగుసార్లు అవుట్ చేశాడు. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్‌తో జరిగిన హరారే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హీత్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టులో సగం మందిని పెవిలియన్‌కు పంపాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హీత్ 32 ఓవర్లలో 73 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే, హీత్‌ స్ట్రీక్‌ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, ఆ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హీత్ స్ట్రీక్ జింబాబ్వే తరఫున 65 టెస్టులు, 189 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 1990 పరుగులు, వన్డేల్లో 2943 పరుగులు చేశాడు. టెస్టుల్లో హీత్ ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు సాధించగా, వన్డేల్లో 13 హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 73 పరుగులకు ఆరు వికెట్లు, వన్డేల్లో 32 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో నైట్‌రైడర్స్‌ జట్టుకు కోచ్‌గా కూడా వ్యవహరించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement