Wednesday, May 8, 2024

Delhi | అధ్యక్ష పదవిపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా : రఘునందన్‌రావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి మార్పు విషయంలో తాను మాట్లాడినట్టు వస్తున్న వార్తలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖండించారు. సోమవారం సాయంత్రం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ… తాను పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను, హోంమంత్రి అమిత్ షాను కించపరచలేదని స్పష్టం చేశారు. మీడియాతో సరదాగా మాట్లాడిన విషయాలను తప్పుగా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రచారం చేశారని వాపోయారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి తన నియోజకవర్గం సమస్యలపై మాట్లాడానని తెలిపారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రూ. 120 కోట్లతో తన నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరానని రఘునందన్ తెలిపారు. పదేళ్లుగా బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేస్తున్న వ్యక్తిని తాననని ఆయన వివరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని తపించే వ్యక్తిని తానని చెప్పారు. అధికారికంగా, అనధికారికంగా పార్టీ కోసం పని చేశానని గుర్తు చేశారు. పార్టీలో పదవులు ఆశించడంలో తప్పులేదన్న ఆయన, అధ్యక్ష మార్పు నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని అన్నారు.

- Advertisement -

నాయకత్వ మార్పు నా పరిధిలోని అంశం కాదన్న రఘునందన్, ఆ అంశంపై తానేమీ మాట్లాడలేనని వివరించారు. నాయకత్వం మార్పునకు సంబంధించి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని వెల్లడించారు. పదవుల రేసులో తాను లేనంటే తన సేవలను పార్టీ ఇంకో విధంగా వాడుకోవాలని భావిస్తుందేమోనని అభిప్రాయపడ్డారు. బీజేపీలో పదవులు ఇవ్వకపోయినా సామాన్య కార్యకర్తగా, ఎమ్మెల్యేగా పని చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. రెండోసారి బీజేపీ గుర్తుపై దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానని, రఘునందన్ – కమలం గుర్తు వేర్వేరు కాదు, ఇద్దరిని కలిపి వేరుగా చూడొద్దని కోరారు.

తన ముఖం చూసి, బీజేపీ గుర్తు చూసి ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. రెండు నెలల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తామేనని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ యూనిఫాం సివిల్ కోడ్‌పై తన అభిప్రాయం చెప్తే బాగుంటుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేస్తుందని చెప్పడం సత్యదూరమని ఆయన నొక్కి చెప్పారు.అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌తో  ఏం మాట్లాడారో చెప్పాలని రఘునందన్‌రావు నిలదీశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement