Sunday, May 5, 2024

Weather: 12 భాషల్లో వాతావ‌ర‌ణ స‌మాచారం…వచ్చే వారం నుంచి గ్రామ‌స్థాయిలో విడుద‌ల‌

ఇక నుంచి వాతావారణ సమాచారం ప్రతి గ్రామపంచాయతీలో అందుబాటులోకి రానుంది. వాతావరణ అంచనాలను వచ్చేవారం నుంచి గ్రామ పంచాయతీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు ‘భారత వాతావరణ విభాగం’ (ఐఎండీ) తెలిపింది. అయితే కేవలం ఇంగ్లీష్లోనే కాదు.. ఇక నుంచి హిందీ సహా 12 భారతీయ భాషల్లో ఈ సమాచారం అందుబాటులో ఉండనుంది.

ఏడాదిపాటు జరిగే ఐఎండీ 150వ వార్షికోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ‘ప్రతి చోటా వాతావరణం.. ఇంటింటికీ వాతావరణం’ పేరుతో ఈ కొత్త సేవను అదేరోజు ప్రారంభిస్తున్నారు. వాతావరణ నష్టాల నుంచి చిన్న రైతులను ఆదుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆ విభాగ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు. ”వాతావరణ సూచనల్ని మండలాల (బ్లాకుల, తాలూకాల) స్థాయి నుంచి గ్రామాలకు తీసుకువెళ్లడం సాధ్యమైంది. పంచాయతీ స్థాయి వాతావరణ సేవల ద్వారా దేశంలో ప్రతి గ్రామంలో కనీసం అయిదుగురు రైతులతో అనుసంధానం కావాలనేది మా లక్ష్యం. తీవ్రమైన వాతావరణ హెచ్చరికలతోపాటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం, గాలుల వేగం వంటి వివరాలను ‘పంచాయతీ వాతావరణ సేవ’ ద్వారా పొందవవ‌చ్చ‌న్నారు.


వాతావరణ సమాచారాన్ని వాడుకుని, తదనుగుణంగా స్పందిస్తే వర్షాధార ప్రాంతాల్లోని చిన్నరైతులు రూ.12,500 వరకు లబ్ధి పొందవచ్చు. ఇప్పటివరకు మేం 3 కోట్ల మంది రైతులకు చేరువయ్యాం. వీరికి రూ.13,300 కోట్ల మేర లబ్ధి కలిగింది. దేశంలోని 10 కోట్లమంది రైతులకూ మేం చేరుకోగలిగితే స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఎంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు’ అని మహాపాత్ర తెలిపారు. నిర్మాణ పనులు ప్రారంభించేముందు, పెళ్లిళ్లు చేసేముందూ ప్రజలు వాతావరణ వివరాలు వినియోగించుకోవాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement