Friday, May 10, 2024

జ‌లాశ‌యాలు అడుక్కి .. తన్నీరు తన్నీరు అంటున్న జనం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ అడుగంటి పోతున్నా యి. ఒక వైపు ఏప్రిల్‌ ప్రారంభం నుండే ప్రారంభమైన భానుడి భగభగలు మూడో వారంలోనే రోహిణీ కార్తె ఎండలను తలపిస్తున్నాయి. మరోవైపు మంచినీటి ఎద్దడి గ్రామాల్లో ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో జలాశాయల్లో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతుండటంతో తాగు, సాగు నీటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి నీటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. బిందెడు నీళ్లకోసం ప్రజలు గంటల కొద్దీ సమయం వెచ్చించాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో ఎక్కడిక్కడ నీటి నిల్వలు అడుగంటడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో మొత్తం నిల్వ సామర్ధ్యం 820.75 టీఎంసీలు ఉండాల్సి ఉండగా ఈనెల 16వ తేదీ నాటికి 314.59 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 379.04 టీఎంసీల నిల్వ ఉంది. కాగా, ఈ వేసవిలో కురిసే వర్షాలకు గానూ దాదాపు 506.16 టీఎంసీల నీరు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది నీటి నిల్వలు తగ్గినట్లు ప్రస్ఫుటంగా అర్ధమౌతోంది. ఇక రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలైన శ్రీశైల, నాగార్జున సాగర్‌లలో కూడా నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌ లో 885 అడుగుల మేర నీటిమట్టం ఉండాల్సి ఉండగా ఆదివారం ఉదయం వరకూ కేవలం 804.7 టీఎంల మేర మాత్రమే అంటే 3,13,963 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. అలాగే నాగార్జున సాగర్‌లో గరిష్ట నీటి మట్టం 590 అడుగులు ఉండాల్సి ఉండగా ఆదివారం ఉదయం వరకూ 526 టీఎంసీలు అంటే 160.443 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇక ఈప్రాజెక్టు నుండి 6,510 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 19,746 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తుంది. ప్రతి ఏటా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో పలుచోట్ల నీటిఎద్దడి తలెత్తే అవకాశం ఉందన్న అంచనాతో ఆర్‌డబ్ల్యూఎస్‌ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 48 వేల గ్రామీణ నివాసిత ప్రాంతాలు ఉండగా.. మండు వేసవిలో 4,926 నివాసిత ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటు-ందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు గత ఏడాది రూ.89 కోట్లు- ఖర్చు చేయగా ఈఏడాది జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో కేటాయింపులు మరింతగా పెంచాలని భావిస్తున్నారు.

గోదావరి జిల్లాల్లోనూ..
వేసవిలో చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్‌, ప్రకాశం జిల్లాల్లో నీటి ఎద్దడికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ 4 జిల్లాలతోపాటు- అనుకోని పరిస్థితులు తలెత్తితే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ పలు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. నీటిఎద్దడి ఉండే ప్రాంతాల్లో సరఫరా చేసే నిమిత్తం గత ఏడాది వివిధ జిల్లాల్లో రైతులకు చెందిన 418 వ్యవసాయ బావులను అద్దెకు తీసుకున్నారు. ట్యాంకుల ద్వారా నీటి సరఫరాలో అవకతవకలు జరగకుండా ట్యాంకర్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారైన యాప్‌ను ఉపయోగించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని మంచినీటి వనరులను సందర్శించి వాటికి అవసరమైన చిన్నపాటి మరమ్మతులు ఉంటే తక్షణం పనులు పూర్తి చేయించాలని నిర్ణయించారు. నీటి ఎద్దడిని పరిష్కరించడంలో గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల సేవలను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వినియోగించుకోనున్నారు.

పశువులకూ నీరు
మండు వేసవిలో ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని 732 నివాసిత ప్రాంతాల్లో పశువులకు సైతం నీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటు-ందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పశువుల అవసరాలకు నీటిని సరఫరా చేసేందుకు గత ఏడాది రూ.7 కోట్లు- ఖర్చు కాగలదని అంచనా వేయగా ఈఏడాది రూ. 10 కోట్ల వరకూ ఈ అంచనాలు పెరగనున్నట్లు తెలుస్తోంది.

సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు ఫుల్‌
వివిధ గ్రామాల్లో ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరాకు అవసరమైన నీటిని నిల్వ ఉంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,501 సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయి. ఈ ట్యాంకులన్నిటినీ పూర్తిస్థాయిలో నింపాల్సి ఉంది. మరమ్మతుల కారణంగా కేవలం 10 ట్యాంకులలో మాత్రం నీటిని నిల్వ ఉంచలేని పరిస్థితి ఉంది. అత్యవసరమైతే సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులను వివిధ మార్గాల ద్వారా నింపేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement