Monday, April 29, 2024

దేశ సంపదను దోచేందుకే బీఆర్‌ఎస్‌.. భట్టి విక్రమార్క

గోదావరిఖని, ఏప్రిల్‌ 17 (ప్రభ న్యూస్‌): దేశ సంపదను దోచేందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోకి సోమవారం భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ఎల్లంపల్లి బ్రిడ్జి వద్ద పార్టీ శ్రేణులతోపాటు మహిళలు, యువకులు, రైతులు పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. రూ. 1.25లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరందించలేని అసమర్ధ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మన సంపద, మన కొలువులు మనకే కావాలని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో లక్ష్యాలు నెరవేరడం లేదన్నారు. నిజాం కాలం నాటి జెన్కో పవర్‌ ప్రాజెక్టును ఆధునీకరణ చేయాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు కావస్తున్నా రామగుండం జెన్కో పవర్‌ ప్రాజెక్టును అప్‌ గ్రేడ్‌ చెయకుండా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతులా నిద్రపోతుందన్నారు. సూపర్‌ క్రిటికల్‌ పవర్‌ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి అయ్యే అవకాశముందని, కానీ ఇక్కడి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల తీరు చూస్తే ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్న చిత్తశుద్ధి లేదని అర్ధమవుతుందన్నారు. జెన్కో పవర్‌ ప్రాజెక్టును సూపర్‌ క్రిటికల్‌ పవర్‌ ప్రాజెక్టుగా మార్చడం వల్ల ఈ ప్రాంతంలోని యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశమున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం అసమర్థతకు నిదర్శనమన్నారు. ఓట్ల కోసం హైదరాబాద్‌లో గోదావరి నీళ్లను ఇంటింటికి ఉచితంగా అందించే ముఖ్యమంత్రి రామగుండానికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రామగుండంలో దొరికే నీళ్లు కూడా కొనుక్కొని తాగాలా..? రామగుండం ప్రజలు గొదావరి నీళ్లను కొనుక్కొని తాగే దుస్థితి ఉంటే ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడన్నారు. ఈ ప్రాంతంలో దొరికే ఇసుక పవర్‌ ప్రాజెక్టుల నుంచి వచ్చే బూడిదని కూడా వదలని ఎమ్మెల్యే రామగుండానికి అవసరమా ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఇసుక బూడిది అమ్ముకోవాలన్న సోయి తప్ప ప్రజల సమస్యలు తీర్చాలన్న ఆలోచన లేకపోవడం విచాకరమన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో యువకుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేసిన ఎమ్మెల్యే తీరు చాలా అన్యాయమన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి నిరుద్యోగుల ఆత్మహత్యకు కారణమైన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను ఊరూరా నిలదీయాలన్నారు. ఇలాంటి పాలకులను వెలివేయాన్నారు. ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌లతో రామగుండాన్ని బొందల గడ్డగా మార్చారని, సింగరేణిలో ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌ ఉండదని గతంలో ప్రకటించిన కేసీఆర్‌ ప్రస్తుతం విచ్చలవిడిగా ఓపెన్‌ కాస్ట్‌ గనులు ప్రారంభిస్తూ స్థానిక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.

రామగుండం నియోజకవర్గంలో 5 ఇం-్లకెన్‌ ప్రాంతంలో ఓపెన్‌ కాస్ట్‌ గనులు ప్రారంభించారన్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ పార్టీగా మార్చింది దేశ సంపదను దోపిడీ చేయడానికేనన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 42 వేల కోట్లు వెచ్చించిన విుషన్‌ భగీరథ పథకంతో ఏ ఊరిలోనూ నీళ్లు రావడం లేదన్నారు. 1.25 లక్షల కోట్లతో నిర్మించిన కాలేశ్వరం ద్వారా అదనంగా ఒక ఎకరానికి కూడా ఈ ప్రభుత్వం నీరు ఇవ్వడం లేదన్నారు. మిషన్‌ భగీరథ, కాలేశ్వరం ప్రాజెక్టులు పూర్తిగా కమిషన్ల పేరిట దోపిడీ చేయడానికేనని, దేశంలో మిషన్‌ భగీరథ, కాలేశ్వరం ప్రాజెక్టు రోల్‌ మోడల్‌గా ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ పథకాల నిధులను దోపిడీ చేసినట్టుగానే దేశ సంపదలు దోచేయడానికి బీఆర్‌ఎస్‌ పేరుతో కుట్రలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో మూసివేసిన పరిశ్రమలు తెరిపించలేని సీఎం కేసీఆర్‌ విశాఖ ప్లాంట్‌ కొనుగోలు చేస్తానని వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలో ఉన్న స్పిన్నింగ్‌ మిల్లు మూసివేసి ఏళ్లు గడుస్తున్నా తెరిపించాలన్న సోయిని విస్మరించి ఇప్పుడు విశాఖ ప్లాంట్‌ కొందామని పోవడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే శ్రీపాద ఎల్లంపల్లి లిప్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేసి పాలకుర్తి అంతర్గాం మండలాలకు సాగునీరు అందిస్తామన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను పూర్తిగా రద్దు చేస్తామని, సింగరేణిలో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి సింగరేణి కాలరీస్‌ సంస్థ ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారమై, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని రామగుండంలో గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement