Tuesday, May 21, 2024

ప్రాజెక్టులకు జలకళ.. మేడిగడ్డకు 17వేల క్యూసెక్కుల వరద

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రెండు, మూడు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలతోపాటు, ఎగువన ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు నెమ్మదిగా వరద కొనసాగుతోంది. ఆశించిన స్తాయిలో కాకున్నా క్రమంగా కొద్దిపాటి వరద రోజూ కొనసాగుతోంది. భారీ వర్షాలు కురిస్తే గాని ప్రాజెక్టులకు జలకళ రాదని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏటా జులై నెలలో ప్రాజెక్టులకు వరద పోటు ఉంటుందని చెబుతున్నారు. కాగా… ఎగువన హైదరాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరడంతో అధికారులు మూసి గేట్లను అడుగున్నర మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గినా… అవుట్‌ ఫ్లో 4169.34 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అదేసమయంలో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645 అడుగులు కాగా… ప్రస్తు తం ప్రాజెక్టులో నీటి మట్టం 643. 61 అడుగులుగా కొనసాగుతోంది. మూసీ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 3.96 టీఎంసీలుగా నమోదయింది.

మేడిగడ్డకు 17వేల క్యూసెక్కుల వరద..

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన లక్ష్మీ (మెడిగడ్డ) బరాజ్‌లోకి వరద క్రమంగా వచ్చి చేరుతోంది. భూపాలపల్లి జిల్లా ఎగువన కురుస్తున్న వర్షాలకు బరాజ్‌కు 17320 క్యూసెక్కుల వరద వస్తోంది. బరాజ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 16.17 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 9.635 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ 10గేట్లు ఎత్తి 15310 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

కనువిందు చేస్తున్న జలపాతాలు…

ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్‌ జిల్లాలోని పొచ్చర, కుంటల జలపాతాలతోపాటు ములుగు జిల్లాలోని బొగత జలపాతం కొత్త శోభను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలకు వరద ప్రవాహం పెరిగింది. జలపాతాలు కనువిందు చేస్తుండడంతో సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. అయితే జలపాతాల వద్ద సందర్శకులకు అధికారులు తగిన వసతులు కల్పించకపోవడంతో పర్యాటకులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. జలపాతాల వద్దకు రోడ్డు సౌకర్యం సరిగా లేదని, సరైన పార్కింగ్‌ తోపాటు లోతు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో హెచ్చరికల బోర్డులు, ప్రమాదం జరిగితే స్పందించేందుకు రెస్క్యూ సిబ్బంది కూడా లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement