Thursday, May 2, 2024

చెరువు పండగలో విషాదం..! లారీ ఢీ కొని వీఆర్‌ఏ దుర్మరణం

తాండూరు రూరల్,  (ప్రభన్యూస్): తాండూరు మండలంలో నిర్వహించిన చెరువు పండగలో విషాదం నెలకొంది. వీఆర్‌ఏగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు. కరణ్ కోట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన సలీం(45) గ్రామంలో ఊట బంది కింద వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం గ్రామ సమీపంలోని చెరువు వద్ద చెరువు పండగ నిర్వహించారు. ఈ ఉత్సవాలలో సలీం విధులు నిర్వహించారు.

ముగింపు సమయంలో రోడ్డుపై వచ్చే వాహనాలను నియంత్రించేందుకు గ్రామ సమీపంలోని గౌతాపూర్- చించోల్లి రోడ్డు మార్గం వద్దకు వచ్చాడు. ఓగిపూర్ నుంచి తాండూరు వైపు వస్తున్న లారీ(ఏపీ29 3993) వేగంగా దూసుకొచ్చి సలీంను ఢీ కొట్టింది. దీంతో సలీం అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందాడు. సలీం మరణంతో కుటుంబంతో పాటు అప్పటి వరకు ఉత్సహాంగా జరిగిన చెరువు పండగ సంబరాలలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న కరన్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు విషయం తెలుసుకున్న గౌతాపూర్ గ్రామ సర్పంచ్ రాజప్ప గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, ఆర్ఐ రాజా రెడ్డిలు ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు మృతుని భార్య, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement