Thursday, May 9, 2024

సేంద్రియ వ్యవసాయమే ఉత్తమం.. ‘భూమి సుపోషణ్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సుస్థిర అభివృద్ధికి సేంద్రియ వ్యవసాయమే ఉత్తమమైన మార్గమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. భూసారాన్ని కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్ తరాలకు ఆహార భద్రతను అందించగలమని స్పష్టం చేశారు. సహజ వనరులైన భూమి, నీరు అపరిమితం అనే ఆలోచన సరికాదని, పరిమితమైన ఈ వనరులను పరిరక్షించుకుంటూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. సోమవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో భూసారం ప్రాముఖ్యతను వివరిస్తూ రాసిన ‘భూమి సుపోషణ్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి, భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూసారం నానాటికీ తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రిమిసంహారకాలు, రసాయనాలను అవసరానికి మించి వినియోగిస్తుండటం వల్ల భూమి తన సారాన్ని కోల్పోతోందన్నారు. ఈ విషయంపై అన్నదాతల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. దీనికితోడు బోరుబావులను పరిమితికి మించి వినియోగించడం వల్ల భూమిలో ఉండాల్సిన తేమ తగ్గిపోతోందని దీని కారణంగా సారవంతమైన నేలలు ఇసుకమేటలతో మిగిలిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సమస్యలనుంచి బయటపడేందుకు సేంద్రియ వ్యవసాయమే ఉత్తమమైన మార్గమన్న ఉపరాష్ట్రపతి, దీని కారణంగా భూసారం పెరగడంతోపాటు రైతులపై ఉత్పాదక భారం తగ్గుతుందన్నారు. భూసార పరీక్ష కేంద్రాల నెట్ వర్క్ ను బలోపేతం చేయడంతోపాటు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా గంగానది పరీవాహక ప్రాంతాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్న విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 6లక్షల మంది రైతులు, దాదాపు 43 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తుండటం శుభపరిణామం అన్న ఉపరాష్ట్రపతి, ఎక్కువగా కొండలు, గుట్టలున్న ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గుచూపడాన్ని అభినందించారు. చిన్న రాష్ట్రాలు సేంద్రియ వ్యవసాయం లాభసాటి అని నిరూపిస్తున్నాయని మరీ ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఇది ఓ వరంగా మారుతుందని వెంకయ్య అన్నారు. వ్యవసాయమే భారతదేశ మూల సంస్కృతి అన్న ఉపరాష్ట్రపతి, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతోపాటు సేంద్రియ వ్యవసాయంలో ఉత్పత్తిని పెంచే విధంగా మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. ఈ దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రత్యేకమైన దృష్టి సారించాలని, సృజనాత్మక పద్ధతులకు ప్రోత్సాహాన్నిచ్చేలా పరిశోధనలు జరపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కద్ సిద్ధేశ్వర్ స్వామీజీ, ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత కార్యకారిణి సభ్యులు భాగయ్య, అక్షయ్ కృషి పరివార్ అధ్యక్షుడు మనోజ్ సోలంకి, నాబార్డ్ చైర్మన్ డాక్టర్ జీఆర్ చింతల గోవిందరాజులుతోపాటు అన్నదాతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement