Friday, April 26, 2024

Delhi | మాగుంట రాఘవ బెయిల్‌పై ఏప్రిల్ 6న తీర్పు.. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. శనివారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులో ఉన్న స్పెషల్ కోర్టు సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) రెండు దర్యాప్తు సంస్థలు సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, తాజాగా ఈడీ కేసులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. శనివారం ఆ పిటిషన్‌పై స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.కే. నాగ్‌పాల్ విచారణ చేపట్టగా సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాదులు దయాన్ కృష్ణన్, మోహిత్ మాథుర్ హాజరయ్యారు. ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్ హాజరైనప్పటికీ బెయిల్ పిటిషన్‌పై దర్యాప్తు సంస్థ ఈడీ ఇంకా జవాబు ఇవ్వలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ ఏప్రిల్ 5 మధ్యాహ్నం గం. 2.00కు వాయిదా వేశారు.

- Advertisement -

మరోవైపు ఇదే కోర్టులో మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మాగుంట రాఘవ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. గత విచారణలో రాఘవ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా, శనివారం నాటి విచారణ ఈడీ తరఫున వాదనలు ముగిశాయి. తదుపరి ఇంకా ఏమైనా ఉంటే తమ వాదనలను రాతపూర్వకంగా అందజేయాలని న్యాయమూర్తి ఇరు పక్షాలకు సూచించారు. తదుపరి ఏప్రిల్ 6న బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించనున్నట్టు వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement