Tuesday, May 14, 2024

వందేభారత్‌ రైలు.. సికింద్రాబాద్‌-తిరుపతి రూట్‌ ఖరారు, ఇవిగో డిటెయిల్స్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి నడిచే వందేభారత్‌ రైలు రూట్‌ ఖరారైంది. ఈ రైలును బీబీనగర్‌-నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా నడపాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా ఈ రైలును వరంగల్‌-ఖాజీపేట మార్గంలో నడపాలని రైల్వే అధికారులు భావించినప్పటికీ ఈ మార్గంలో దూరం ఎక్కువ అవుతున్నందున దాని బదులు బీబీనగర్‌-నడికుడి మార్గంలో నడపాలని నిర్ణయించారు. కాగా, ఇప్పటికే బీబీనగర్‌ నుంచి గుంటూరు వరకు ఉన్న రైల్వే మార్గంలో ట్రాక్‌లను ఆధునీకరించి గంటకు 130 కి.మీ.ల వేగంతో ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో తిరుపతికి వెళుతున్న నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ 664 కి.మీ.ల దూరాన్ని 12.30 గంటల సమయంలో చేరుకుంటుంది.

ఈ రూట్‌లో సాధారణ ప్రయాణికులతో పాటు వర్తక, వాణిజ్యాలు చేసే వారికి సైతం సౌకర్యంగాఉంది. వందేభారత్‌ రైలును ఈ మార్గంలో నడపడం ద్వారా దూరంతో పాటు సమయం కూడా తగ్గించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ రైలుకు ఆదరణ పెరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే, సికింద్రాబాద్‌ తిరుపతి మధ్య వందేభారత్‌ రైలును ప్రారంభించే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. రైల్వే బోర్డు నుంచి అధికారిక సమాచారం రాగానే, రైలు ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement