Monday, May 6, 2024

Big Story | ఖాళీగా ఉన్న హెచ్‌ఎం పోస్టులు.. ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్న విద్యాశాఖ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాఠశాల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అంతా ఇన్‌చార్జిల పాలనే దిక్కైంది. ఒకవైపు టీచర్‌ పోస్టులే ఖాళీగా ఉన్నాయంటే దానికితోడూ ప్రధానోపాధ్యాయుల పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఏళ్లతరబడిగా వాటిని భర్తీ చేయడంలేదు. దీంతో ప్రభుత్వ విద్య పర్యవేక్షణ కరువైంది. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4,252 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఉన్నాయి. వాటిలో దాదాపు 2,271 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. కానీ మరో 1,982 పోస్టుల ఖాళీగానే ఉన్నాయి.

భారీగా ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉడడం వల్ల విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలకు డీఈఓ ఎలాగో…మండలానికి ఎంఈఓ…పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు అలాగే. పాఠశాలలు సవ్యంగా నడవాలన్నా, స్టాఫ్‌తో సమన్వయం చేసుకొని మంచి ఫలితాలు రాబట్టాలన్నా పర్యవేక్షణ అవసరం. పర్యవేక్షణ ఉండాలంటే పూర్తిస్థాయిలో ప్రతి పాఠశాలకు హెచ్‌ఎం ఉండాల్సిందే. రాష్ట్రంలో సుమారు 2వేల వరకు ఖాళీలు ఉన్నాయంటే ఆ పాఠశాలల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

ఖాళీలున్న చోట్ల ఇన్‌చార్జిలతో అధికారులు నెట్టుకొస్తున్నారు. ఒక్క హెచ్‌ఎం పోస్టులే కాదు…డీఈఓ, ఎంఈఓ పోస్టులు కూడా భారీగానే ఖాళీగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో బదిలీలు, ప్రమోషన్లు, రిక్రూట్‌మెంట్‌ లేకపోవడంతో విద్యాశాఖలో స్తబ్దత నెలకొంది. ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఇన్‌చార్జిలను నియమించి నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 33 జిల్లాలకు అనుగుణంగా డీఈఓ పోస్టులను ఇంత వరకూ మంజూరు చేయలేదు. పరిపాలనా సౌలభ్యం కొరకు 2016లో తెలంగాణ ప్రభుత్వం పది జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించింది. 33 జిల్లాల్లో 12 జిల్లాలకే రెగ్యులర్‌ డీఈఓ పోస్టులున్నాయి. అందులోనూ రెగ్యులర్‌ డీఈఓలు ఏడుగురే ఉన్నారు.

మిగిలిన 5 జిల్లాల్లో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మిగిలిన జిల్లాలకు ఇంకా పోస్టులు కేటాయించలేదు. పోస్టులు మంజూరు చేయని జిల్లాలకు ఇన్‌జార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 15 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. టీచర్‌ సంఘాలు మాత్రం సుమారు 20 వేల వరకు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటున్నాయి. పండిట్‌, పీఈటీ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులనూ ప్రభుత్వం మంజూరు చేయాల్సిన ప్రతిపాదన పెండింగ్‌లోనే ఉంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలకు పోస్టులను మంజూరు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement