Friday, May 17, 2024

300 యూనిట్లవరకు కరెంట్‌ ఉచితం.. పంజాబ్‌ పౌరులకు ఆప్‌ నజరానా

పంజాబ్‌ విద్యుత్‌ వినియోగదారుల మోములు ఒక వెలుగువెలిగేలా ఆప్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రతి గృహ వినియోగాదారులకు గరిష్టంగా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పొందవచ్చని ప్రకటించింది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సారథ్యంలో అధికారం చేపట్టి నెలరోజులు పూర్తయిన నేపథ్యంలో ఈ నజరానా ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ శనినారం ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఎస్‌సీ, బీసీ, నిరుపదేలు, స్వాతంత్ర సమరయోధులకు నెలకు 200 యూనిట్లవరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. తాజా నిర్ణయంతో వీరితోపాటు ఇతర వర్గాలకు చెందినవారికి కూడా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేయనున్నారు. అయితే ఇక్కడ ఒక షరతు విధించారు. రెండునెలలకు కలిపి 600 యూనిట్లకన్నా అధికంగా విద్యుత్‌ వినియోగించి ఉంటే, పైన పేర్కొన్న వర్గాల వారికి అదనపు యూనిట్లకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆయావర్గాలకు చెందని, ఇతర గృహ వినియోగదారులు రెండునెలలకు కలిపి 600 యూనిట్లకన్నా అధికంగా విద్యుత్‌ను ఉపయోగించి ఉంటే మొత్తం అన్నియూనిట్ల బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా తాజా నిర్ణయంతో ఆప్‌ ఎన్నికల హామీల్లో కీలకమైనది పూర్తి చేసినట్టయింది. కాగా పంజాబ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆప్‌ సారథి, ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశంసించారు. అన్ని పార్టీలమాదిరిగా తాము అబద్దపు హామీలు ఇవ్వబోమని, ఇచ్చిన మాట అమలుచేసి తీరుతామని, అందుకు పంజాబ్‌ సీఎం తాజా నిర్ణయమే ఉదాహరణ అని ట్విట్టర్‌లో స్పందించారు. కాగా ఉచిత విద్యుత్‌ మంచినిర్ణయమే అయినా వెంటనే అమలు చేయకుండా జులై వరకు ఎందుకు ఆగారని, అసలు ఈ పథకంలో నిబంధనలన్నీ చూస్తేగాని విషయం బోధపడదని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement