Friday, May 3, 2024

U19 Asia Cup | భారత్, పాక్‌లకు శృంగభంగం, ఫైనల్స్‌లో బంగ్లాదేశ్, యుఎఈ

ఆసియాకప్‌ టోర్నీ నుంచి భారత్‌ వైదొలిగింది. దుబాయ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి చవి చూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యువభారత్‌ 42.4 ఓవర్లలో 188 పరుగులు చేసి ఆలౌటయ్యింది. మురుగన్‌ అభిషేక్‌ (62; 73 బంతుల్లో 6×4,2×6) ముషీర్‌ ఖాన్‌ (50; 62 బంతుల్లో 3×4) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ కేవలం 42.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అరిఫుల్‌ ఇస్లామ్‌ (94; 9×4,4×6) విజృంభించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆహర్‌ అమిన్‌ (44) పరుగులు చేశాడు.

పాక్‌ పరాజయం..

మరోవైపు పాకిస్థాన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో యూఏఈ 11 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ 47.5 ఓవర్లలో 193 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఆర్యన్‌ ఖాన్‌ (55), ఆర్యాన్ష్‌ శర్మ (46) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ కేవలం 49.3 ఓవర్లు ఆడి 182 పరుగులకు ఆలౌటయ్యింది.

సాద్‌ బయాగ్‌ (50), అజన్‌ అవాయిస్‌ (41) మినహా మిగతా వారెవ్వరూ పెద్దగా రాణించలేదు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని పాకిస్థాన్‌ సెమీస్‌లో పరాజయంపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్‌, యూఏఈలు ఆదివారం తలపడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement