Friday, May 17, 2024

Delhi | తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పు ప్రచారమే : డా. కే. లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తున్న కథనాలన్నీ కేవలం ప్రచారం మాత్రమేనని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, ఎంపీ డా. కే. లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణలో కనుమరుగు కాబోతుందని అన్నారు.

ఆ పార్టీ మనుగడ కూడా కష్టమేనని, ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ పూర్తిగా బీజేపీ – కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని తెలిపారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రజలు కాంగ్రెస్ ప్రకటించిన ఉచితాలను తిరస్కరించారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ అనుకూలత కారణంగానే విజయం సాధించగలిగామని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌ ఎన్నికలుగా చెప్పుకున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారని, ఫైనల్స్(లోక్‌సభ ఎన్నికల్లో)లో కూడా బీజేపీనే గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ ఓబీసీ వ్యతిరేకులేనని, దక్షిణ – ఉత్తర భారతం అంటూ దేశ ప్రజలను విభజించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని మండిపడ్డారు.

- Advertisement -

ఉత్తర భారత ఓటర్లను కించపరిచేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. ద్రవిడ – ఆర్య సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చి కాంగ్రెస్ పబ్బం గడువుకుంటోందని చెప్పారు. మోడీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అని వ్యాఖ్యానించి డా. కే. లక్ష్మణ్.. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం మోడీ గ్యారెంటీ అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement