Monday, April 29, 2024

చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకుల కోసం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర్రంలోని వివిధ జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్‌ నగరంలో చారిత్రక కట్టడాలు, సుందర జలాశయాలు, ప్రసిద్ధ దేవాలయాలు, పార్కులు, వాటర్‌ ఫాల్స్‌ ఎన్నో ఉన్నాయి. వారాంతం వచ్చిందంటే చాలు ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం పర్యాటకులు వందల సంఖ్యలో వస్తుంటారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాలలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రాంతాల వివరాలు, వాటి విశిష్టతను తెలియజెప్పే వివరాలను టీఎస్‌ ఆర్టీసీ విశేషంగా ప్రచారం చేస్తున్నది. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ జిల్లాలలో పర్యాటక, చారిత్రక ప్రాంతాలు ఉన్నాయి.

ఈ జిల్లాలకు సరిహద్దు రాష్ట్ర్రాల నుంచి వచ్చే పర్యాటకులకు కూడా టీఎస్‌ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నది. అదే విధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో పార్కులు, చారిత్రక కట్టడాలు వందల సంఖ్యలో ఉన్నాయి. నగరానికి కొత్తగా వచ్చిన వారికి ఏ బస్సు ఎక్కడ ఎక్కాలి ? గమ్యస్థానాన్ని ఎలా చేరుకోవాలో తెలియక తికమకపడుతుంటారు, ఇలాంటి వారి కోసం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎలాంటి టెన్షన్‌ లేకుండా నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించేలా వీలు కల్పించింది. పాఠశాల యాజమాన్యాలు, కళాశాలల విద్యార్థులు, కుటుంబాలకు, ఉద్యోగులకు ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ప్యాకేజీలో భాగంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలని అనుకునే పెద్దలు రూ.250, చిన్నారులు రూ.130 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు అయితే పెద్దలకు రూ.450, చిన్నారులు అయితు రూ.340 చెల్లించాలి. టికెట్లను ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్‌ దర్శన్‌ ప్యాకేజీలో భాగంగా బిర్లా మందిర్‌, చౌమహల్లాప్యాలెస్‌, తారామతి బారాదరి రిసార్ట్స్‌, గోల్కొండ కోట, దుర్గం చెరువు, కేబుల్‌ బ్రిడ్డి, హుస్సేన్‌ సాగర్‌, ఎన్టీయార్‌ పార్క్‌లను పర్యాటకులు సందర్శించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement