Wednesday, May 15, 2024

Delhi | కవిత కేసులో నిజాలు బయటికొస్తాయి : మల్లురవి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంలో నిజాలు బయటికొస్తాయని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనపై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, కవిత అరెస్టు అంశంపై స్పందిస్తూ సమర్థించలేక, వ్యతిరేకించలేక మల్లగుల్లాలు పడ్డారు.

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని తాము చెప్పామని అన్నారు. అయితే కవితను అరెస్టు చేసిన ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో మాత్రం రూ. 100 కోట్లు చేతులు మారాయని చెబుతున్నారని, కవిత పాత్ర ఉందని అంటున్నారని మల్లు రవి అన్నారు. అలాగే ఇదే కేసులో ఢిల్లీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరెస్టయ్యారని చెప్పారు. నిజాలు దర్యాప్తులో బయటపడతాయని, ఏ తప్పూ లేకుండా అరెస్టు చేసినట్టు తేలితే అప్పుడు మాట్లాడతానని చెప్పారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీతో ఎందుకు పొత్తులు పెట్టుకున్నారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు బదులిస్తూ.. విపక్ష (ఇండియా) కూటమి పొత్తులకు, కేసులకు సంబంధం లేదని, కూటమిలో ఎన్నో పార్టీలు ఉన్నాయని తెలిపారు. నిజానికి బీజేపీతో బీఆర్ఎస్ సీక్రెట్ ఒప్పందం చేసుకుందని, రెండు పార్టీలు తాము గెలవకపోయినా ఫరవాలేదు కానీ కాంగ్రెస్ మాత్రం గెలవకూడదు అన్నట్టుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. అందుకే పరోక్షంగా పరస్పరం సహకరించుకుంటున్నాయని అన్నారు.

మరోవైపు 100 రోజుల పాలనలో 100 తప్పులు అంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలకు బదులిస్తూ.. ఒక్క తప్పు చూపించండి చాలు అంటూ సవాల్ విసిరారు. దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే ఇండియా కూటమి లక్ష్యమని, అందుకే అనేక పార్టీలతో కలిసి పోరాడుతున్నామని చెప్పారు. మరోవైపు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్ విభజన కొలిక్కి వచ్చిందని చెప్పారు. ఏకాభిప్రాయంతో రెండు తెలుగు రాష్ట్రాలు చేసిన విభజన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం లభించిందని తెలిపారు.

చేరికలకు బాధ్యులు వారే

కాంగ్రెస్ పార్టీలో చేరికలకు బీఆర్ఎస్ నేతలే కారణమని మల్లు రవి అన్నారు. “ప్రభుత్వాన్ని పడగొడతాం అని బీఆర్ఎస్ నేతలే అన్నారు. వారికి బీజేపీ నేతలు కోరస్ కలిపారు. చెరపకురా చెడేవు అంటారు. మా సర్కారును చెడగొట్టే ప్రయత్నం చేస్తే, వారే దెబ్బతింటున్నారు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం కోసమే చేరికలు అని నేరుగా చెప్పకపోయినా.. ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు నచ్చక పార్టీ వీడి తమ వద్దకు వస్తున్నారని పరోక్షంగా చెప్పారు. చేరుతున్నవారిలో.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కూడా ఉన్నారని అన్నారు. ఈ చేరికలకు బాధ్యులు బీఆర్ఎస్ నేతలేనని, శిశుపాలుడి మాదిరిగా 100 రోజుల్లో 100 తప్పులు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ తమ నేతలను కోల్పోతోందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement