Sunday, April 28, 2024

వారం రోజుల్లో త్రిపుల్‌ ఆర్‌ భూసేకరణ షురూ.!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ నగర చుట్టు పక్కల జిల్లాలు, ప్రధాన పట్టణాల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణంలో అధికారులు స్పీడ్‌ పెంచారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం కోసం భూసేకరణ పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలిసింది. పలు గ్రామాలు గుండా వెళ్తున్న ఈ మార్గంలో అత్యధికంగా ప్రైవేట్‌ వ్యక్తుల భూమే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అందులోనూ వ్యవసాయ భూమే ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఉత్తర భాగానికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు రెండు గెజిట్లు విడుదల చేశారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ అభ్యంతరాల స్వీకరణను స్థానిక రెవెన్యూ అధికారులు స్వీకరిస్తున్నారు. అందుకోసం స్థానిక ఆర్డీఓలను కంపిటెంట్‌ ఆథారిటీలుగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఏర్పాటు చేసింది. భరతమాల పరియోజన పథకం కింద చేపడుతున్న ఈ ప్రాజెక్టును ఇటీవల 98.989 కిలోమీటర్ల నుంచి 118.188 కిలోమీటర్ల వరకు గెజిట్‌ విడుదల చేయగా అందుకు మొత్తంగా 521.72 ఎకరాల భూమి అవసరం ఉందని ప్రాథమికంగా ఇప్పటికే గుర్తించారు. ఈ భూమి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఏడు గ్రామాల్లో ఈ భూమి అవసరం కానుంది. దత్తాయి పల్లె, ఇబ్రహింపూర్‌, కోనాపూర్‌, వీరారెడ్డిపల్లె, వేల్పులపల్లె దత్తార్‌పల్లె, మల్లాపూర్‌ గ్రామాల గుండా మొదటి గెజిట్‌లో పేర్కొన్న రోడ్డు మార్గం వెళ్ళనుంది. అయితే ఈ గ్రామాల్లో అత్యధికంగా భూమి ప్రైవేటు వ్యక్తులదేనని అధికారులు గుర్తించారు. అది కూడా వ్యవసాయ భూమి అధికంగా ఉందని అధికారులు నిర్ధారించారు. మొత్తం భూమిలో 390.2 ఎకరాల ప్రైవేటు భూమి కాగా, 131.52 ఎకరాల భూమి ప్రభుత్వానిదని గుర్తించినట్లు తెలిసింది. ప్రస్తుతం అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మరొక వారం, పది రోజుల్లో ఇది ముగియనుంది. ఆ తర్వాత భూసేకరణ పనులను చేపట్టనున్నట్లు సమాచారం.

పరిహారం ఎకరాల్లో కాకుండా చదరపు మీటర్లలో?..

ఆర్‌ఆర్‌ఆర్‌ తొలి గెజిట్‌ పరిధిలో సేకరించే భూమికి పరిహారం చదరపు మీటర్లలో ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్తున్న గ్రామాల్లో వ్యవసాయ భూమి ఉండడంతో రైతులంతా ఎకరాల్లోనే తమకు పరిహారం ఇవ్వాలని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అధికారులు మాత్రం ఎకరాల్లో కాకుండా చదరపు మీటరల్లో పరిహారం కట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిసింది. ఇటీవల కాలంలో జరిపిన భూక్ర, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ రేటు, భూసేకరణ చట్టం-2013 ప్రకారం ధర నిర్ధారిస్తామని పేర్కొంటున్నారు. ఎలాంటి చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ఈ విషయంపై స్థానిక రెవెన్యూ అధికారులతో కంపిటెంట్‌ అధికారులు కలిసి పని చేస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 4,046 చదరపు మీటర్లుగా లెక్కించి దానికి పరిహారం నిర్ధారించి ఏ రైతు భూమి ఎంతమేర సేకరిస్తామో అనే విషయంపై అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తామని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానికంగా అలైన్‌మెంట్‌పై ఒక ప్రైవేట్‌ ఏజెన్సీ చేసిన సర్వే నివేదికను ఆ సంస్థ ఇటీవల స్థానిక రెవెన్యూ అధికారులకు అందజేసింది. ఏజెన్సీ ఇచ్చిన సర్వేనంబర్లను జిల్లా రెవెన్యూ అధికారులు మరోసారి అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. భూమికి సంబంధించిన పట్టాదారు పేరు, సర్వే నంబరు, విస్తీర్ణం, గ్రామం, మండలం, జిల్లా వంటి వివరాలను ప్రత్యేక పద్ధతిలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పొందుపరుస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే వారం, పది రోజుల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభంకానున్నట్లు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement