Monday, April 29, 2024

ప.బెంగాల్‌లో విషాదం.. ఇళ్లకు నిప్పు.. పది మంది సజీవ దహనం

•38 మందికి తీవ్ర గాయాలు
•40 ఇళ్లు దగ్ధం.. ఖండించిన గవర్నర్‌

పశ్చిమ బెంగాల్‌లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లాలో పది మంది సజీవ దహనం అయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడి హత్యకు ప్రతీకారంగా వారి ఇళ్లకు నిప్పు పెట్టినట్టు తెలుస్తున్నది. అర్ధరాత్రి సమయంలో 10-12 ఇళ్లకు నిప్పు పెట్టారు. 10 మంది సజీవ దహనం కాగా.. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 40 ఇళ్ల వరకు పూర్తిగా కాలిపోయాయి. రాంపూర్‌హట్‌ పట్టణం శివారులోని బొగతుయ్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్ని మాపక దళం ఎంతో కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సహాయ చర్యలు చేపడుతున్నారు. 10 మంది మృతదేహాలను వెలికి తీశారు. డీఎంతో సహా బీర్భూమ్‌ జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

టీఎంసీ నేత హత్యే కారణం!

బీర్భూమ్‌ జిల్లాలోని రాంపూర్‌హాట్‌ ప్రాంతంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన పంచాయతీ నాయకుడు బదు షేక్‌ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ప్రతీకారంగానే నిప్పంటించినట్టు తెలుస్తున్నది. రాజకీయ హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ ఏర్పాటు చేశారు. సీఐడీ ఏడీజీ జ్ఞానవంత్‌ సింగ్‌, పశ్చిమ రేంజ్‌ ఏడీజీ సంజయ్‌ సింగ్‌, డీఐజీ సీఐడీ ఆపరేషన్‌ మీరజ్‌ ఖలీద్‌లకు విచారణ బాధ్యతలను అప్పగించారు. ఈ విషయంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ స్పందిస్తూ.. రాంపూర్‌హాట్‌ ఘటన.. రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఇది స్థానిక ప్రజల మధ్య జరిగిన చిన్న గొడవ అంటూ కొట్టిపారేశాడు. గవర్నర్‌ కూడా తీవ్రంగా ఖండించారు. భయంకరమైన హింస అని, హింసా సంస్కృతి, చట్టవిరుద్ధమైన విషయాన్ని సూచిస్తుందన్నారు. పూర్తి సమాచారం ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించానని గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement