Thursday, May 2, 2024

ఈ ఏడాది పొగాకు ఓకే! ముగిసిన వేలం.. వరుస నష్టాల నుంచి ఊరట…

అమరావతి, ఆంధ్రప్రభ : లాభాలు పొగచూరి వరుస నష్టాలతో అప్పులపాలవుతున్న పొగాకు రైతాంగానికి ఈ ఏడాది ఊరట లభించింది. కంపెనీలకు ఎగుమతి ఆర్డర్లు రావటంతో పాటు స్వీయ నియంత్రణ పాటించి పొగాకు బోర్డు నిర్దేశించిన లక్ష్యానికన్నా తక్కువ విస్తీర్ణంలో పొగాకు సాగు చేయటం కలిసొచ్చింది. దక్షిణాది నల్లరేగడి నేలలు (ఎస్‌.బి.ఎస్‌), దక్షిణాది తేలికపాటి నేలలు (ఎస్‌ఎల్‌ఎస్‌) పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గరిష్టంగా 100 రోజుల కాలపరిమితి లోపు అధికారులు వేలం ప్రక్రియను ముగించారు. ఈ సీజన్‌ లో కేజీ సగటు ధర 172.49 రూపాయలు పలకటం విశేషం. గడిచిన మూడేళ్లలో సగటు ధర 125 నుంచి 150 రూపాయల లోపే ఉంది. అందులోనూ వాతావరణం అనుకూలించక లోగ్రేడ్‌ రకమే ఎక్కువ పరిమాణంలో రావటంతో ధరలు దారుణంగా పడిపోయాయి. లోగ్రేడ్‌ రకం కొనుగోలును కంపెనీలు తిరస్కరించటంతో ప్రభుత్వమే ఏపీ మార్క్‌ ఫెడ్‌ ను రంగంలోకి దించించింది..లోగ్రేడ్‌ ను కొనుగోలు చేయించటం ద్వారా రైతులకు భారీ నష్టాల నుంచి కొంత ఉపశమనం కలిగించింది. ఈ ఏడాది ఆ స్థాయి ప్రతికూల వాతావరణం అంతగా లేకపోగా..దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో వేలం ప్రక్రియను గిట్టు బాటు ధరలతో విజయవంతంగా ముగించారు. వేలం ముగింపు దశలో మీడియం, సీ గ్రేడ్‌ పొగాకు ధరలు సైతం కేజీ రూ 165 నుంచి 185 దాకా పలికాయి. దీంతో పొగాకు రైతులకు ఆశాజనకమైన సగటు- ధర లభించింది.

లక్ష్యానికన్నా తగ్గిన విస్తీర్ణం
ఈ ఏడాది (2021-22) సీజన్‌ లో ఎస్బీఎస్‌, ఎస్‌ఎల్‌ ఎస్‌ లో 11 వేలం కేంద్రాల పరిధిలో పొగాకు బోర్డు 50,081 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుకు పొగాకు బోర్డు అనుమతిచ్చినా రైతులు మాత్రం 47,507.71 హెక్టార్లలో పంట పండించగలిగారు. 80.72 మిలియన్‌ కిలోల పంటను లక్ష్యంగా నిర్ణయించగా విస్తీర్ణం తగ్గటంతో 76.57 మిలియన్‌ కిలోల పంట మాత్రమే చేతికందింది. నూటికి 90 శాతానికి పైగా పంట పండే ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని వెల్లంపల్లి వేలం కేంద్రంలో 7.28 మిలియన్‌ కిలోల పొగాకు అమ్మకాలు సాగగా..ఒంగోలు-1 లో 9.71, ఒంగోలు-2లో 7.38, టంగుటూరులో 9.08, కొండెపిలో 9.09, పొదిలిలో 6.76, కనిగిరి వేలం కేంద్రంలో 3.96 మిలియన్‌ కిలోల పొగాకు అమ్మకాలు సాగాయి. మొత్తం 30368 మంది రైతులు 23962 లైసెన్స్‌ కలిగిన బ్యారన్ల కింద పొగాకు పండించగా..ఒక్కొక్క బ్యారన్‌ కు సగటు-న లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా లాభం వచ్చినట్టు అధికారవర్గాల అంచనా.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement