Friday, April 19, 2024

చంద్రబాబు ‘రాజపక్సె’ కావొచ్చు.. ఏపీ మాత్రం ఎన్నటికీ శ్రీలంక కాబోదు : విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చుతూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తిప్పికొట్టారు. చంద్రబాబు నాయుడే ‘రాజపక్సె’ మాదిరిగా సింగపూర్ పారిపోవచ్చు తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నటికీ శ్రీలంక కాబోదని తేల్చిచెప్పారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో సహచర ఎంపీలు మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, అయోధ్య రామిరెడ్డి, గురుమూర్తి, డా. సత్యవతి తదితరులతో కలిసి విజయసాయి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్దిక పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కంటే కూడా మెరుగ్గా ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలోని అనేక ధనిక రాష్ట్రాలు చేసిన అప్పులతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌ చాలా మెరుగైన పరిస్థితులలో ఉందని గణాంకాలతో సహా ఆయన వివరించారు. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ అప్పులు-జీడీపీ నిష్పత్తి 57% ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 32.4% మాత్రమే ఉందని తెలిపారు. పంజాబ్ 47%, రాజస్థాన్ 39.8%, పశ్చిమ బెంగాల్‌ 38.8%, కేరళ 38.3%తో ఆంధ్రప్రదేశ్ కంటే ముందున్నాయని తెలిపారు. ఈ నెల 19న శ్రీలంకలో జరిగిన పరిణామాలపై కేంద్ర ఆర్దిక మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రుల ఆధ్వర్యంలో  ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శ్రీలంకలోని పరిణామాలు, ఆ దేశానికి ఎలా సహాయపడగలం అన్న విషయాలపై చర్చ మొదలెట్టి ఆశ్చర్యకరంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్దిక పరిస్థితులపైకి చర్చను మళ్ళించారని విజయసాయి రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, ఉత్పత్తి, అప్పులపై మంత్రులు వివరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, కేంద్రం చేసిన అప్పుల గురించి మాత్రం సమావేశంలో ప్రస్తావించలేదని అన్నారు. రుణాలు – జీఎస్డీపీ నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు రూ. 8,500 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ. 25,194.62 కోట్లని విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్ర ద్రవ్యలోటు జీఎస్డీపీతో పోల్చకుంటే కేవలం 2.1%కన్నా తక్కువగానే ఉందని తెలిపారు. ఇది 15వ ఆర్దిక సంఘం సూచించిన 4.5% పరిమితి కంటే తక్కవగానే ఉందని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 6.9% ఉంటే ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు కేవలం 3.18% మాత్రమే ఉందని తెలిపారు.

అసలు శ్రీలంక సంక్షోభానికి కారణాలేమిటి?
ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా అయిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వాస్తవాలు తెలసుకోవాలని ఆయన అన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం ఆ దేశం నుంచి ఎగుమతులు భారీగా క్షీణించాయి. విదేశీ చెల్లింపులు (రెమిటెన్స్)లు గణనీయంగా తగ్గిపోయాయి. వ్యవసాయోత్పత్తులు తగ్గి, టూరిజం ఆదాయం దారుణంగా పడిపోయింది. శ్రీలం కరెన్సీ విలువ పడిపోయింది. పైగా శ్రీంక దిగుమతులపై ఎక్కువగా ఆధారపడినందున విదేశీ మారకద్రవ్యం మొత్తం ఆవిరైపోయింది. శ్రీలంక సంక్షోభానికి ఇవే ప్రధాన కారణాలని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 2019-20 సంవత్సరానికి శ్రీలంక వ్యాపార ఎగుమతులు 12.9 బిలియన్ డాలర్లు. ఆంధ్రప్రదేశ్ ఎగుమతులు రూ. 85,665 కోట్లు. 2021లో శ్రీలంక మొత్తం ఎగుమతులు 12 బిలియన్ డాలర్ల వద్దే స్తంభించిపోయింది. ఏపీ ఎగుమతులు ఏకంగా 62% పెరిగి రూ. 2 లక్షల కోట్లకు చేరింది. 2020లో భారతదేశంలోకి వచ్చిన విదేశీ చెల్లింపులు 83 బిలియన్ డాలర్లు. శ్రీలంకకు వచ్చింది 7.1 బిలియన్ డాలర్లు మాత్రమేనని అన్నారు. 2021-22లో విదేశీ చెల్లింపులు భారతదేశంలో 87 బిలియన్ డాలర్లకు పెరిగింది. శ్రీలంకకు వచ్చిన విదేశీ చెల్లంపులు 5.49 బలియన్ డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన విదేశీ చెల్లింపులు 4.35 బిలియన్ డాలర్లని అన్నారు. విదేశీ చెల్లింపులు అందుకోవడంతో ఏపీ సుస్థిర పెరుగుదల నమోదు చేసిందని అన్నారు. ఈ కారణాల నేపథ్యంలో శ్రీలంక సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్‌కు ఏ విధంగా పోలిక పెడతారని ఆయన ప్రశ్నించారు.

పన్నుల వాటాలో రాష్ట్రాలకు కోత
కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపేణా వచ్చిన మొత్తంలో 41% రాష్ట్రాలకు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్నటికీ నిజానికి అంత మొత్తంలో రాష్ట్రాలకు అందడం లేదని విజయసాయి రెడ్డి వివరించారు. 2015-16లో పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ. 14.4 లక్షల కోట్లు. అందులో నుంచి కేవలం 34.91% మాత్రమే రాష్ట్రాలకు వాటాగా అందింది. అందులో ఏపీకి వచ్చింది 1.50% మాత్రమే. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపేణా వచ్చిన మెత్తం రూ. 14.4 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ. 28 లక్షల కోట్లకు పెరిగింది. అయినప్పటికీ అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన వాటా 1.5% నుండి 1.32%కి తగ్గిపోయిందని అన్నారు.  2015-16లో కేంద్ర నిధుల పంపిణీలో ఏపీ వాటా రూ. 21,791 కోట్లు. 2021-22 సంవత్సరంలో ఇచ్చింది రూ. 35,685 కోట్లు మాత్రమే అన్నారు. కేంద్రం సెస్‌లు, సర్‌చార్జీల ద్వారా తన ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్రాలకు వచ్చేఆదాయాన్ని ప్రణాళికా బద్దంగా తగ్గించేస్తున్నదని అన్నారు. రాష్ట్రాలకు ఆదాయం వచ్చే పన్నులు పెంచకుండా ఒక ప్రణాళికతో పన్నులపై సెస్, సర్‌చార్జీలు పెంచుకుంటూ పోతుందని అన్నారు. పెరిగిన సెస్, సర్‌చార్జీల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరంలేనందున కేంద్రం తన ఆదాయాన్ని ప్రతి ఏటా పెంచుకుంటూ పోతుంది. సెస్, సర్‌ఛార్జీలలో రాష్ట్రాలకు వాటా ఇచ్చి ఉంటే ఈ అయిదేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌కు సుమారుగా రూ. 50 వేల కోట్లు అదనంగా అంది ఉండేవని అన్నారు. ఆ నిర్ణయంతో దేశంలో ఏపీతో పాటు ఇతర రాష్రాలు కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయని అన్నారు. దీనిపై చట్టం చేయాల్సిన అవసరం ఉందని, సెస్, సర్‌ఛార్జీలలో రాష్ట్రాలకూ వాటా ఇవ్వాల్సిందేనని విజయసాయి రెడ్డి అన్నారు.

చంద్రబాబు హయాంలో 117.42% పెరిగిన అప్పులు
2014-19 కాలానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60% అధికంగా అప్పులు చేస్తే, ఆ కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 117.42% అప్పులు చేసిందని విజయసాయి రెడ్డి విమర్శించారు. సీఏజిఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) అప్పులు చంద్రబాబు హయాంలో 16.8%కి పెరిగాయని అన్నారు. 2019-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం అప్పులు 49.6% పెరిగితే ఏపీలో వైఎస్సార్సీపీ  ప్రభుత్వం హయాంలో 43% మాత్రమే పెరిగాయని అన్నారు. సీఎజీఆర్ అప్పులు 12.75% మాత్రమే పెరిగాయని అన్నారు. కోవిడ్ మహమ్మారి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమయంలోనూ రాష్ట్రంలో వివిధ డీబీటీ (డైరెక్ట్ బెనిషిట్ ట్రాన్స్‌ఫర్‌ ) పథకాల ద్వారా నిరుపేదలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు రూ. 1.62 లక్షల కోట్లు సాయంగా అందించినట్టు గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎంపీ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం బదులిస్తూ 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 1,62,828 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేసిందని పేర్కొన్నారు. దీనికి అతీగతీలేదని, ఆ ఖర్చును క్రమబద్ధీకరించలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పిందని విజయసాయి రెడ్డి అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో నిధులు ఏవిధంగా దుర్వినియోగం అయ్యాయో అర్దం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్నవి ఉచిత పథకాలు కావని అన్నారు. ప్రజలకు అందిస్తున్న పథకాలను చూసి ఓర్వలేని తెలుగుదేశం ప్రభుత్వం, రాష్ట్ర బిజేపీ నేతలు ఉచితాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయం రంగంలో 14.5%, హార్టికల్చర్ 13.24%, లైవ్ స్టాక్ రంగం 11.46%, మత్స్యరంగం 25.92%,  పారిశ్రామిక రంగం 25.58%, మైనింగ్ 38.41%, తయారీ రంగం 24.84%, నిర్మాణ రంగం 26.75% అభివృద్ది సాధించిందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తున్నాం: మిధున్‌రెడ్డి
ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా రాష్ట్రానికి నిధులు వచ్చేందుకు ఎంతో కృషి చేశారని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వాటర్‌గ్రిడ్‌ పథకానికి ప్రభుత్వం దాదాపు రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఇందులో 50 శాతం నిధుల కోసం సీఎంతో పాటు తామంతా కలిసి ప్రయత్నించాం. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి దాదాపు రూ.4500 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. పాత చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు వల్ల కలుషితమైన ప్రాంతాల్లో మంచినీటి కోసం వాటర్‌గ్రిడ్‌ పథకం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇంకా పంచాయతీరాజ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు ఎక్కువగా వచ్చేలా మేమంతా కలసికట్టుగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. నేషనల్‌ హైవేలో కోసం రాష్ట్రానికి అత్యధిక నిధులు వచ్చేలా చూస్తున్నాం. సచివాలయ వ్యవస్థ, ఆర్బీకేలను కేంద్రం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. వలంటీర్‌ వ్యవస్థను చత్తీస్‌గఢ్, అసోం, యూపీ వంటి రాష్ట్రాలు అధ్యయనం చేసి, అక్కడా మొదలు పెడుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల పరిస్థితులు కల్పించాం. దాంతో పెట్టుబడులు ఈ మూడేళ్లలో గణనీయంగా పెరిగాయి. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. పరిమితికి లోబడి రుణాలు చేయడం, వాటిని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీద ఖర్చు చేయడం సానుకూల సంకేతమని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement