Sunday, May 5, 2024

జిల్లా పేరులో మార్పు ఉండదు, అదే పేరు కొనసాగుతుంది.. ఎంపీ సుభాష్ చంద్రబోస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు భాధాకరమని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన మంగళవారం జిల్లాలో చోటుచేసుకున్న హింసపై ఆయన స్పందించారు. మేధావులు, విద్యావంతులతో మాట్లాడిన తర్వాత కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారని ఆయన తెలిపారు. సంఘ విద్రోహ శక్తులు అశాంతిని సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించడం సరికాదని, కార్యకర్తలు సంయమనం పాటించాల్సిందిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పిలుపునివ్వాలని అన్నారు. అంబేద్కర్ లాంటి మహనీయులను వివాదంలోకి లాగడం సరికాదని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

గతంలో కోనసీమ జిల్లా ఏర్పడితే అంబేద్కర్ పేరుపెట్టాలని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ కోరిన మాట నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ముందొక మాట, వెనుకొక మాట మాట్లాడడం సరికాదని హితవు పలికారు. కార్యకర్తలను రెచ్చగొట్టొద్దని, అల్లకల్లోలం సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ స్వార్థంతో టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సరే జిల్లా పేరు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు అంబేద్కర్ పేరు కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement