Friday, May 3, 2024

Delhi | కోర్టుల్లో పేదల‌కు న్యాయం జరగడం లేదు.. మాజీ మంత్రి చింతా సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 20 ఏళ్లుగా న్యాయస్థానాల్లో పేదవారికి న్యాయం జరగడం లేదని అన్నారు. సోమవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో న్యాయస్థానాలు గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హైకోర్టుకు వెళ్లినా ఊరట లభించకపోవడంపై స్పందిస్తూ కోర్టుల వెనుక అదృశ్య హస్తం ఉందని అన్నారు. తాను న్యాయవ్యవస్థలను విమర్శించడం లేదని, కానీ తీర్పులను విమర్శించడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించారు. కోర్టులు, దర్యాప్తు సంస్థలు తప్పు చేస్తున్నాయని అన్నారు.

లక్షలు ఖర్చు పెట్టి న్యాయవాదులను పెట్టుకుంటేనే కేసులు అడ్మిట్ అవుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. వివేకా హత్య కేసు, జగన్ అక్రమాస్తుల కేసులకు న్యాయస్థానాల్లో అతీగతీ లేదని, కానీ రాహుల్ గాంధీ చిన్న మాట అన్నందుకు ఏకంగా రెండేళ్ల జైలు శిక్ష, దాని ఆధారంగా ఎంపీ పదవి తీసేయడం కూడా జరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసు గురించి పోస్ట్‌మాన్‌కు కూడా తెలుస్తుందని, కానీ సీబీఐకి మాత్రం తెలియడం లేదని ఎద్దేవా చేసారు. కోర్టుల్లో డబ్బులు తీసుకుని బెయిల్ ఇస్తున్నారని అందరూ అనుకుంటున్నారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు.

మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనపైనా విమర్శలు చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. అదానీకి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఉక్కు పరిశ్రమలు కట్టబెడుతూ ప్రైవేటు పరం చేస్తున్నాడు తప్ప పేదవాళ్లకు ఉపయోగపడే పని ఏం చేశారని నిలదీశారు. వరంగల్ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అవినీతిమయం అంటూ ప్రధాన మంత్రి వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి తగదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల స్కాలర్‌షిప్పులను తొలగించారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ళలో జగన్ సాధించింది ఏమైనా ఉందంటే అది విపరీతమైన అవినీతి మాత్రమేనని ధ్వజమెత్తారు.

- Advertisement -

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను చూస్తే జాలి కలుగుతోందని, ఆయన పార్టీ పరిస్థితి థీమ్ లేని సినిమా మాదిరిగా ఉందని చింతా మోహన్ అన్నారు. షర్మిల ఎక్కడికీ పోలేక కాంగ్రెస్ వైపు చూస్తోందిని, ఎవరు వచ్చినా తాము స్వాగతిస్తామని అన్నారు. అయితే ఆయన తండ్రి మాదిరిగా తాము నెత్తికి ఎక్కించుకోమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి వల్ల అధికారంలోకి రాలేదని, కాంగ్రెస్ విధానాలు నచ్చి, సోనియా గాంధీ నచ్చి ప్రజలు ఓటేశారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి వల్ల కాంగ్రెస్ కి లాభం కంటే నష్టమే జరిగిందని విమర్శించారు. ఏపీలో ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారని, పురందేశ్వరి వచ్చినా బీజేపీకి ఒరిగేదేమీ లేదని అన్నారు. ఏపీలో, దేశంలో రాజకీయ భవిష్యత్తును దళితులు నిర్దేశించబోతున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement