Friday, April 26, 2024

కొత్తగా ఏర్పాటు కాబోయే మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేయాలని : మంత్రి హ‌రీశ్‌రావు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ‌ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం నుంచి ఎన్‌హెచ్ఎం, టీఎస్ఎంఎస్ఐడీసీల‌పై నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. సీఎం కేసీఆర్ మార్గ‌నిర్దేశనంలో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం పరిశీలనకు వచ్చేనాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. నిర్మాణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. అన్ని ప్ర‌భుత్వ‌ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, మూడు నెలల బఫర్ స్టాక్ మెంటెయిన్ చేయాలని మంత్రి హ‌రీశ్‌రావు సూచించారు. మందుల సరఫరాలో ఎలాంటి నియంత్రణ ఉండవద్దని, అవసరమైన మేరకు మందులు ఆయా ఆస్ప‌త్రుల‌కు పంపిణీ చేయాలని ఆదేశించారు. రియేజెంట్స్ కొరత లేకుండా లేకుండా చూసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, 24 గంటల్లోగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement