Friday, April 26, 2024

సుర్రుమంటున్న సూర్యుడు.. ఎండ వేడిమితో విలవిలలాడుతున్న ప్రజలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : వర్షాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. వానాకాలంలోనే ఎండాకాలం కనిపిస్తుండడంతో ప్రజలు బెంబేళెత్తిపోతున్నారు. చినుకు జాడ లేకపోగా సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 8గంటలకే ఎండ దంచికొడుతుండడంతో దినసరి కూలీలు, ఉద్యోగస్థులు ఆందోళన చెందుతున్నారు. ఎండ వేడిమి మాత్రమే కాకుండా ఉక్కపోత కూడా ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వానాకాలం వేసవికాలాన్ని తలపిస్తుండడంతో ఏసీలు లేనిదే ఇంట్లో ఉండే పరిస్థితి లేకుండాపోయింది. తెలంగాణలోని కొన్ని జిల్లాలు, ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా నమోదవుతోందని చెబుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా అర్లీ గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం తీవ్రతకు అద్దంపడుతోంది. గత పదేళ్ల సెప్టెంబరు నెల చరిత్రలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. సాధారణంగా సెప్టెంబరు నెలలో రాత్రిపూట 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అందుకు భిన్నంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదవుతున్నట్లు వాతావరణశాఖ చెబుతోంది. పగలు, రాత్రిపూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వచ్చే రెండు మూడు రోజుల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించినా ఆదివారం ఎండ దంచికొట్టింది. హిమాలయాల వైపు రుతుపవనాలు వెళ్లిపోవడం, ఉపరితల ద్రోణి, ఆవర్తనం లేకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఆ ప్రభావం పంటలపై తీవ్రంగా చూపుతోంది. సకాలంలో వ ర్షాలు కురవకపోవడంతో రైతులు వేసిన సోయా చిక్కుడు, మొక్కజొన్న, మినుము వంటి పంటల్లో జీవం లేకుండా పోతోంది. దీంతో దిగుబడి పడిపోతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొని ఉంది. మరోవైపు దక్షిణ, ఆగ్నేయ దిశలో వస్తున్న గాలులతో వచ్చే రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement